ఆకాశం నీ హద్దురా విడుదల వాయిదా

By iDream Post Oct. 22, 2020, 09:25 pm IST
ఆకాశం నీ హద్దురా విడుదల వాయిదా

ఈ నెల 30న అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కావాల్సిన కొత్త సినిమా ఆకాశం నీ హద్దురా వాయిదా పడింది. ఈ విషయాన్ని హీరో సూర్య ఓపెన్ లెటర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఏవియేషన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన చిత్రం కావడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ నుంచి జారీ కావాల్సిన ఎన్ఓసి(నిరభ్యంతర పత్రం)లు రావడంలో ఆలస్యం జరుగుతుండటంతో పోస్ట్ పోన్ చేయక తప్పడం లేదని అందులో పేర్కొన్నారు.అయితే కొత్త డేట్ ఎప్పుడు ఉండొచ్చనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. నిజానికి ఈ వార్త నిన్నటి నుంచే చెన్నై మీడియాలో ప్రచారంలో ఉంది. అభిమానులు అది పుకారై ఉండొచ్చనుకున్నారు కానీ అదే నిజమయ్యింది.

ఆకాశం నీ హద్దురా తమిళంలో సూరారై పోట్రు పేరుతో రూపొందింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ కీలక పాత్ర చేశారు. దర్శకురాలు గురు ఫేమ్ సుధా కొంగర టేకింగ్ మీద టీజర్ చూసాక మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎయిర్ డెక్కన్ అధినేత గోపినాథ్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ మూవీని అధికశాతం రియల్ లొకేషన్స్ లో షూట్ చేశారు. అందుకే బడ్జెట్ కూడా భారీగా అయ్యింది. ప్రైమ్ ఎంతకు కొందనే ఖచ్చితమైన ఫిగర్ బయటికి రాలేదు కానీ భారీ మొత్తం అన్నది మాత్రం నిజం. ఈ న్యూస్ విన్న సూర్య ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఇంకో వారం రోజుల్లో తమ హీరో కొత్త సినిమా చూస్తామని ఎదురు చూస్తున్న వాళ్లకు షాక్ తగిలింది.

నవంబర్ 1 నుంచి తమిళనాడులో థియేటర్లు తెరుస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడీ వాయిదా డిస్ట్రిబ్యూటర్లకు సంతోషం కలిగించేదే అయినా ఇది డిజిటల్ లో తప్ప సినిమా హాళ్లలో వచ్చే అవకాశం లేనట్టే. ప్రైమ్ ముందస్తుగా చేసుకునే ఒప్పందాలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి లేట్ అయినా సరే ఆకాశం నీ హద్దురాని చిన్నితెరమీద చూడాల్సిందే. వాయిదా గురించి ఒక ఓపెన్ లెటర్ లో షేర్ చేసుకున్న సూర్య ఈ పరిణామం వల్ల తానెంత బాధ పడ్డాడో వివరించాడు. అక్టోబర్ ని మంచి స్టార్ హీరో సినిమాతో ముగిద్దామని ఎదురు చూసిన మూవీ లవర్స్ కు ఇంకొన్ని రోజులు ఎదురు చూపులు తప్పవు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp