సుప్రసిద్ధ సంగీత దర్శకుడి తొలి ప్రయత్నం

By iDream Post Apr. 17, 2021, 01:30 pm IST
సుప్రసిద్ధ సంగీత దర్శకుడి తొలి ప్రయత్నం

మాములుగా సంగీత దర్శకులు తమ వృత్తి నుంచి పక్కకు వచ్చి ఇతర శాఖలు నిర్వహించడం చాలా అరుదు. మహా అయితే అప్పుడప్పుడు స్క్రీన్ మీద కనిపించడం తప్ప అదే పనిగా నిర్మాణాలు రచనలు దర్శకత్వాల జోలికి వెళ్లిన వాళ్ళు చాలా అరుదు. అందుకే ఏఆర్ రెహమాన్ తనే కథ రాసుకుని నిర్మాతగా మారి సంగీతం అందించే 99 సాంగ్స్ ప్రాజెక్ట్ ని ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఈయనలో ఈ కోణం కూడా ఉందా అంటూ ఆసక్తి పెంచుకున్నారు. నిన్న ఎలాంటి అంచనాలు లేకుండా ఈ మూవీ ఏమంత పోటీ లేకుండా థియేటర్లలో అడుగు పెట్టింది. ఇది ఎలా ఉందో సింపుల్ రిపోర్ట్ లో చూద్దాం.

ఒకరకంగా చెప్పాలంటే ఇది చిరంజీవి ఛాలెంజ్ ని స్ఫూర్తి తీసుకుని రాసుకున్నట్టు అనిపిస్తుంది. సంగీతమంటే ప్రాణమిచ్చే జయ్(ఇహాన్ భట్)ఓ కోటీశ్వరుడి కూతురిని ప్రేమిస్తాడు. కానీ మ్యూజిక్ ని కూడా ఒక బిజినెస్ లా చూసే ఆమె తండ్రితో ఒక్క పాటకి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుందని పందెం కాస్తాడు. కానీ హీరోయిన్ డాడీ ఒక్కటి కాదు వంద పాటలు చేసి నిరూపించమంటాడు. ఆ సవాల్ ని స్వీకరించిన జయ్ కి ఆ తర్వాత ఎదురైన ఆటుపోట్లు, ప్రయాణంలో ఎదురుకున్న కష్టనష్టాలు తదితరాలు తెలియాలంటే 99 సాంగ్స్ చూడాలి. స్థూలంగా చెప్పుకుంటే ఇందులో కథ ఇంతే.

లైన్ బాగానే ఉన్నప్పటికీ దాన్ని ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు విశ్వేష్ కృష్ణమూర్తి ఎలాంటి ప్రత్యేకత చూపకపోవడంతో సినిమా ఆద్యంతం మహా నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరోతో సహా క్యాస్టింగ్ పెర్ఫార్మన్స్ లు బాగున్నాయి. రెహమాన్ సంగీతం మంచి ఫీల్ కలిగించినప్పటికీ దాన్ని వాడుకునేంత బలం కంటెంట్ లో లేకపోవడం 99 సాంగ్స్ లో ఉన్న ప్రధానమైన మైనస్. తనయ్ జేమ్స్ ఛాయాగ్రహణం తదితర సాంకేతిక విభాగాలు ఎంత కష్టపడినప్పటికీ బోర్ గా సాగే టేకింగ్ ని నిలబెట్టలేకపోయాయి. రెహమాన్ మీద విపరీతమైన అభిమానం ఉంటే తప్ప 99 సాంగ్స్ సగటు తెలుగు ప్రేక్షకులకు కనీసం యావరేజ్ అనిపించడం కూడా కష్టమే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp