ఆకాశం విజయానికి ఆరు కారణాలు

By iDream Post Nov. 22, 2020, 08:03 pm IST
ఆకాశం విజయానికి ఆరు కారణాలు

లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజైన సినిమాల్లో యునానిమస్ గా అందరినీ మెప్పించిన సినిమా ఏదంటే ఇప్పటిదాకా ఖచ్చితమైన సమాధానం వచ్చేది కాదు. ఉమామహేశ్వరఉగ్రరూపస్య, కలర్ ఫోటో లాంటివి సోషల్ మీడియాలో మంచి స్పందన దక్కించుకున్నప్పటికీ ఇవి థియేటర్లలో వచ్చి ఉంటే ఈ స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుని ఉండేవా అనే అనుమానాలు మాత్రం అందరిలోనూ ఉన్నాయి. అలా కాకుండా ఇది పెద్ద స్క్రీన్ మీదే చూసి ఉంటే బాగుండేదని ఎక్కువ శాతం ఫీలైన సినిమాగా ఆకాశం నీ హద్దురా నిలుస్తోంది. దానికి దోహదం చేస్తున్న ఆరు కారణాలు ఏంటో ఓసారి చూద్దాం

1. టెర్రిఫిక్ సూర్య

ఈ సినిమా మీద ఇంత బజ్ రావడానికి కారణం వన్ అండ్ ఓన్లీ సూర్యనే. గత కొంత కాలంగా డిజాస్టర్లతో కలత చెందిన అభిమానులకు పూర్తి ఊరట కలిగిస్తూ ఇందులో సూర్య తన విశ్వరూపం ప్రదర్శించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో తన నటనకు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. ఎప్పుడో సూర్య సన్ అఫ్ కృష్ణన్ తర్వాత ఆ స్థాయి పెర్ఫార్మన్స్ ఇందులోనే చూశామని క్రిటిక్స్ సైతం మెచ్చుకున్నారు.

2. హీరోయిన్ కు కొత్త డెఫినేషన్

బహుశా ఈ మధ్యకాలంలో ఎలాంటి ఆర్టిఫీషియల్ మేకప్ లేకుండా హీరోయిన్ ని చూపించిన సినిమాగా ఆకాశం నీ హద్దురానే చెప్పుకోవచ్చు. గ్లామర్ ఫ్యాక్టర్ లేకుండా కేవలం నటనకే ప్రాధాన్యం ఇచ్చిన దర్శకురాలు సుధా కొంగర గురు తరహాలోనే ఇందులో కూడా పెర్ఫార్మన్స్ కోసమే అపర్ణను ఎంచుకోవడం చాలా పెద్ద ప్లస్ అయ్యింది . సూర్య పక్కన సహజమైన నటనతో పక్కింటి అమ్మాయిలా కనిపించిన తనను ఎక్కువ సినిమాల్లో చూస్తామో లేదో కాని ఇది మాత్రం గుర్తుండిపోతుంది

3. పండిన భావోద్వేగాలు

ఇలాంటి బయోపిక్స్ లో ఎమోషన్స్ పండటం చాలా ముఖ్యం. ఎయిర్ డెక్కన్ అధినేత గోపినాద్ గురించి జనానికి తెలిసింది తక్కువే. అలాంటిది తక్కువ డ్రామాతో ప్రేక్షకులను మెప్పించడం అంత సులువు కాదు. అందుకే భావోద్వేగాలను ఎంత ఉండాలో అంతే మోతాదులో ప్రెజెంట్ చేసిన తీరు కొందరిని కంటతడి పెట్టించింది కూడా

4. అసహజత్వానికి దూరం

సూర్య లాంటి పెద్ద కమర్షియల్ స్టార్ ఉన్నాడు కాబట్టి ఏదో మాస్ కోసమన్నట్టు ఎలాంటి బలవంతపు ఇరికింతలు ఇందులో చేయలేదు. ఐటెం సాంగ్ కాదు కదా కనీసం మాంచి బీట్స్ తో హీరో హీరొయిన్ డాన్స్ చేసే పాటను కూడా పెట్టలేదు. అయినా కూడా ఫ్యాన్స్ నిరాశచెందలేదు. ఉన్నతంగా ఉన్న క్యారెక్టరైజేషన్ ను విపరీతంగా ప్రేమించేశారు

5. రాజీపడని నిర్మాణం

ఈ బయోపిక్ బడ్జెట్ పరంగా ఎక్కువ డిమాండ్ చేసినప్పటికీ సబ్జెక్టు మీద నమ్మకంతో సూర్య పెట్టిన కోట్లాది రూపాయల ఖర్చు వృధా కాలేదు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే క్వాలిటీ కోసం ఎంత తపన పడ్డారో స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇక్కడ ఆర్ట్ డిపార్ట్ మెంట్ చేసిన వర్క్ అమోఘం

6. కెప్టెన్ అఫ్ ది షిప్

లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇంత ఘనతకు కారణం డైరెక్టర్ సుధాకొంగర అని చెప్పకపోతే నేరమే అవుతుంది. మహిళా దర్శకులు తక్కువగా ఉన్న పరిశ్రమలో స్టార్లు పిలిచి మరీ అవకాశాలు ఇచ్చే స్థాయికి చేరుకోవడం అంటే మాటలు కాదు. చెప్పిన కథను నిజాయితిగా తెరకెక్కిస్తే దక్కే ఫలితం ఇదే. తాను అందరిలాంటి దాన్ని కానని చేతుల్లో ఋజువు చేస్తున్న సుధా కొంగర ఆకాశం నీ హద్దురాని ఆవిష్కరించిన తీరు అప్ కమింగ్ ఫిలిం మేకర్స్ కు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

ఇలా ఆకాశం నీ హద్దురాకు సోషల్ మీడియా, ఆన్లైన్ లో ఇంత బ్రహ్మరధం దక్కడానికి ఆరు కారణాలుగా చెప్పుకోవచ్చు. సంగీతం, ఛాయాగ్రహణం లాంటి ఇతర అంశాలు చాలానే విజయానికి దోహదపడ్డాయి. ఇలాంటి అవుట్ పుట్ చూడగలిగామంటే దానికి కారణమైన సూర్య, సుధాకొంగరలకే అగ్రతాంబూలం ఇస్తున్నారు ప్రేక్షకులు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp