మహేష్ బాబు కోసం 5 టిప్ ఫార్ములా

By Ravindra Siraj Jan. 23, 2020, 03:33 pm IST
మహేష్ బాబు కోసం 5 టిప్ ఫార్ములా

సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాట్రిక్ తో జోరుమీదున్నాడు. వరుసగా మూడో ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడని అభిమానులు ఆనందంగా ఉన్నారు. అయినా కూడా ఏదో వెలితి. కారణం లేకపోలేదు. 2018లో భరత్ అనే నేను మంచి సక్సెస్ అందుకుంది. టాక్ ఎంత పాజిటివ్ గా వచ్చినా దాని కన్నా కేవలం ఇరవై రోజుల ముందు వచ్చిన రంగస్థలం రికార్డులను మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. చాలా వసూలు చేసిందని పోస్టర్లు వేసుకున్నారు కానీ నిజాలేంటో జనం ఈజీగా గ్రహించారు.

2019లో మహర్షికి పోటీ లేదు. అందరూ సినిమా బాగానే ఉందన్నారు. రైతుల సమస్యను చక్కగా డీల్ చేశారనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. కానీ తీరా చూస్తే నాన్ బాహుబలి స్థాయిలో రికార్డులు నమోదు కాలేదు. ప్రిన్స్ కెరీర్ బెస్ట్ అయ్యింది కానీ అంతకు మించిన స్థాయిని ఆశించారు అభిమానులు.

ఇక ఇప్పుడు 2020లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు కూడా ఫుల్ మీల్స్ లా అనిపించలేదు. అనిల్ రావిపూడి కామెడీ, ఏదో వెరైటీ కోసం భిన్నంగా ట్రై చేసిన సెకండ్ హాఫ్ కొంతమేర దెబ్బ తీశాయి. దీంతో అల వైకుంఠపురములోకు ఎక్కువ మైలేజ్ వచ్చేసి విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో మహేష్ దృష్టి సారించాల్సిన ఒక 5 టిప్ ఫార్ములాని అభిమానుల కోణంలో ఇలా విశ్లేషించడం జరిగింది

1. కామన్ మ్యాన్ అవ్వాలి

ఒకప్పుడు పోకిరి, ఒక్కడు లాంటి సినిమాలతో మైండ్ బ్లోయింగ్ ఫలితాలు అందుకుని ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసిన మహేష్ ఇటీవలి కాలంలో నేలవిడిచి సాము చేస్తున్నాడు. ఒక కామన్ మ్యాన్ గా తమ హీరోని చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాని ఎంతసేపు మిలియనీర్ గానో లేదా చాలా హై ప్రొఫైల్ జాబ్ చేస్తున్న వాడిలాగో కనిపిస్తున్నాడు తప్ప ఘట్టమనేని హీరోలో ఒక పండుగాడు ఒక అజయ్ గాడు బయటికి వస్తే కలెక్షన్ల ఊచకోత ఖాయం.

ఆఖరికి డిజాస్టర్ బ్రహ్మోత్సవంలో కూడా మహేష్ అల్ట్రా రిచ్ ఫామిలీ నుంచే వస్తాడు తప్ప ఓ సామాన్యుడిగా కనిపించి ఏళ్ళు దాటుతోంది. మహేష్ మళ్ళీ ఒకసారి మధ్యతరగతిలోకి వస్తే మాస్ రీచ్ ఇంకా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆ కోణంలో దర్శకులను కథలను తీసుకెళ్లకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం

2. మ్యూజిక్

మహేష్ సినిమాలు మ్యూజికల్ గా నిరాశ పరిచిన సందర్భాలు తక్కువ. బ్లాక్ బస్టర్స్ ని కాసేపు పక్కనపెడితే అంచనాలు అందుకోలేకపోయిన టక్కరి దొంగ, బాబీ, యువరాజు, నిజం లాంటి మూవీస్ పాటల పరంగా మంచి పేరు తెచ్చుకున్నాయి. కానీ మహేష్ కు తన స్థాయికి తగ్గట్టు ఈ మధ్య మ్యూజిక్ పడటం లేదు. అందులోనూ దేవిశ్రీ ప్రసాద్ ప్రతి ఆల్బమ్ లోనూ ఒకటో రెండో చెప్పుకోదగ్గ పాటలు ఇస్తున్నాడు కానీ బెస్ట్ కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పుకోదగ్గది మాత్రం గత మూడేళ్ళలో ఇవ్వలేదు. ఈ లోటు భర్తీ అయ్యేలా మహేష్ కాస్త సీరియస్ గా దీని మీద దృష్టి సారించాలి. ఒకప్పుడు మణిశర్మ ఇప్పుడు ప్రిన్స్ మూవీస్ కి బ్యాక్ బోన్ గా నిలిచే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి.

3. హీరోయిన్

మహేష్ కున్న మా చెడ్డ ఇబ్బంది హీరోయిన్ ఎంపిక. మగాళ్లు సైతం ఈర్ష్య పడే అందంతో ఉండే తన పక్కన సరిజోడిగా కనిపించాలంటే మాములు అందగత్తెలు సరిపోరు. సరిలేరు నీకెవ్వరులో రష్మిక మందన్న పూర్తిగా తేలిపోవడానికి కారణం ఇదే. తను మంచి పర్ఫార్మర్ అయినప్పటికీ జోడి విషయంలో ప్రిన్స్ కి సరితూగలేదు. దానికి తోడు క్యారెక్టరైజేషన్ కూడా అంతంత మాత్రంగా ఉండటంతో జనానికి కనెక్ట్ కాలేదు. మహేష్ కు హీరోయిన్ ను సెట్ చేసే విషయంలో చేసే పొరపాట్లు ఎంత మూల్యం చెల్లిస్తాయో మొదటిసినిమా రాజకుమారుడులోనే తెలిసిపోయింది. మహేష్ పక్కన ప్రీతి జింటా అక్క వయసులో కనిపించిందని అప్పట్లోనే కామెంట్స్ వచ్చాయి. అందుకే గ్లామర్ తోనే మైండ్ బ్లాంక్ చేసే బ్యూటీస్ ని పట్టుకోవడం అసలైన టాస్క్

4. మెసేజ్ వద్దు

స్టార్ హీరోలు ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఇవ్వాలంటే సాధ్యపడదు. ఒకసారి అయితే ఓకే కానీ ప్రతిసారి అదే ప్రయత్నం చేస్తే అంతగా వర్క్ అవుట్ అవ్వదు. చిరంజీవి, కమల్ హాసన్ , విక్రమ్ లాంటి వాళ్ళు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేసినా ఆ వెంటనే కమర్షియల్ మీటర్ లో కథలు ఎంచుకుని బాలన్స్ చేసేవాళ్ళు. కానీ మహేష్ దానికి భిన్నంగా వచ్చిన సబ్జెక్టులన్నింటిలోనూ సందేశం కోసం వెతికితే మాస్ కి దూరమయ్యే ఛాన్స్ లేకపోలేదు. అందుకే కొత్తదనం కోసం ట్రై చేస్తూనే మాస్ ఫార్ములా బేసిక్స్ ఫాలో కావడం చాలా అవసరం

5. విలన్

మహేష్ బాబు లాంటి రేంజ్ ఉన్న హీరోలకు సై అంటే సై అనే విలన్ చాలా అవసరం. ఏ మాత్రం వీక్ గా కనిపించినా హీరోయిజం పండదు. దీనికి మంచి ఉదాహరణగా స్పైడర్ ని తీసుకోవచ్చు. నటనపరంగా ఎస్ జె సూర్య బాగానే చేసినప్పటికీ ప్రిన్స్ రేంజ్ కి సవాల్ విసిరే స్థాయిలో బిల్డప్ ఉండదు. సరిలేరు నీకెవ్వరులో కూడా ప్రకాష్ రాజ్ పాత్ర సెకండ్ నుంచి పూర్తిగా ట్రాక్ తప్పింది. కాస్త ఈ విషయం మీద దర్శకుల ద్వారా ఎక్కువ ఫోకస్ పెడితే ఇంకో అలీ భాయ్ ఇంకో ఓబుల్ రెడ్డి దొరక్కపోరు. దానికి తగ్గట్టు కథా కథనాలు కూడా ఉండాలి మరి

చివరిగా చెప్పాలంటే

పవన్ కళ్యాణ్ సినిమాలు మానేశాక ఇక మహేష్ కు నెంబర్ వన్ చైర్ కోసం పోటీ లేదనుకున్నారు అందరూ. కానీ పవర్ స్టార్ ఏకంగా రెండు సినిమాలతో కం బ్యాక్ ఇస్తున్నాడు. మరోవైపు రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ భారీ క్రేజీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీ హిట్లు కొడుతున్నారు. సాలిడ్ గా మహేష్ నిజమైన నాన్ బాహుబలి బ్లాక్ బస్టర్ అందుకోవాలని సినిమా ప్రేమికులు కోరుకుంటున్నారు. అంతేతప్ప మీడియా పబ్లిసిటీతో మేము సాధించామంటే మేము సాధించామని వందల కోట్ల పోస్టర్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఆ పేరుతో సినిమా చేశాడని కాదు కానీ నిజంగా సరైన కథ దర్శకుడు పడాలి కానీ మహేష్ బాబుకు 'ఒక్కడు' అనిపించుకునే సత్తాని సులువుగా ఋజువు చేసుకోగలడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp