2020 - హీరోల ప్రోగ్రెస్ రిపోర్ట్

By iDream Post Dec. 26, 2020, 02:06 pm IST
2020 - హీరోల ప్రోగ్రెస్ రిపోర్ట్

ప్రతి సంవత్సరం స్కూల్ పిల్లల పెర్ఫార్మన్స్ ని బట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినట్టు సినిమా హీరోలకు సైతం అప్ అండ్ డౌన్ సూచించే గ్రాఫ్ ఒకటి ఉంటుంది. కాకపోతే ఈ ఏడాది తమ ప్రమేయం లేకుండానే ఎందరో స్టార్లు తమ మార్కులను కరోనా కారణంగా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇందులో వాళ్ళ తప్పేమి లేకపోయినా అందరితో పాటు లాక్ డౌన్ రూపంలో కష్టకాలాన్ని ఎదురుకోవాల్సి వచ్చింది. ఓసారి టాలీవుడ్ హీరోల ప్రోగ్రెస్ ఈ ఏడాది ఎలా ఉందో చూద్దాం

ఇద్దరూ ఇద్దరే - 100 కోట్ల యోధులు

ఎంతైనా మహేష్ బాబు, అల్లు అర్జున్ లు అదృష్టవంతులు. సరైన సమయంలో సంక్రాంతికి తమ సినిమాలను టార్గెట్ చేసుకుని చెరో వంద కోట్లకు పైగా వసూళ్లను బాక్సాఫీస్ వద్ద గుమ్మరించారు. అల వైకుంఠపురములో ఫస్ట్ ర్యాంక్ దక్కించుకోగా సరిలేరు నీకెవ్వరు కొంత దూరంలో సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకుంది. చాలా చోట్ల బన్నీ దెబ్బకు నాన్ బాహుబలి రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. మహేష్ సైతం ఎన్నో సెంటర్లలో వసూళ్ల తుఫాను పుట్టించాడు. పండగా సీజన్ బాగా కలిసి వచ్చింది.

నితిన్ ను గెలిపించిన భీష్ముడు

శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న నితిన్ కు భీష్మ రూపంలో కూల్ బ్లాక్ బస్టర్ దక్కింది. మంచి టైమింగ్ చూసుకుని రిలీజ్ చేయడంతో ఈ ఎంటర్ టైనర్ కి ఫ్యామిలీ ఆడియన్స్ అండ పుష్కలంగా దొరికింది. కరోనా లేకపోతే ఇంకొంత ఎక్కువ రన్ దొరికి భారీ ఫిగర్స్ ని నమోదు చేసేది. అయినప్పటికీ నితిన్ కి కెరీర్ బెస్ట్ ఇవ్వడంలో మాత్రం ఫెయిల్ కాలేదు. 40 కోట్లకు పైగా షేర్ తో భీష్మ టాప్ 3 లో దర్జాగా తిష్టవేసుకుంది.

వ్రతం ఫలం రెండూ దక్కని నాని

25వ సినిమాగా ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందని భావించిన నానికి వి తీవ్ర నిరాశ మిగిల్చింది. నేరుగా ఓటిటి రిలీజ్ అయ్యింది కానీ ఒకవేళ థియేటర్లలో అయ్యుంటే డిస్ట్రిబ్యూటర్లకు విపరీతంగా నష్టాలు వచ్చేవి. ఆ రకంగా చూసుకుంటే వికి చెడుతో పాటు మంచి కూడా జరిగింది. ఇంద్రగంటి మోహనకృష్ణ డీల్ చేసిన రొటీన్ సైకో కిల్లర్ డ్రామా ఎవరికీ నచ్చలేదు.

ఓటిటి స్టార్ సత్యదేవ్

ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న సత్యదేవ్ కి లాక్ డౌన్ విడుదలలు చాలా కలిసి వచ్చాయి. 47 డేస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. గువ్వ గోరింకలు డైరెక్ట్ గా ప్రేక్షకులను పలరించాయి. ఇందులో మధ్యలోది మాత్రమే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ గుర్తింపు విషయంలో ఢోకా లేకుండా పోయింది. తమన్నాతో గుర్తుందా శీతాకాలం ఆఫర్ రావడానికి కారణం కూడా ఇదే.

నో సినిమా స్టార్లు

అసలు సినిమాలే విడుదల కానీ హీరోల లిస్టు మాత్రం ఈ ఏడాది ఎప్పుడు లేనంత పెద్దగా ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగ చైతన్య, అఖిల్, రామ్, కార్తికేయ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే అవుతుంది. వీళ్లంతా దాదాపు ఆరేడు నెలలు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. తర్వాత మెల్లగా షూటింగులలో బిజీ అయ్యారు కానీ రిలీజులకు ఏ మాత్రం అవకాశం లేకుండా పోయింది.

సింగల్ మూవీ తారలు

ఏదోలా లక్కీగా ఒక్క సినిమా విడుదల చేసుకున్న హీరోలు మొదటి మూడు నెలల్లోనే వచ్చేశారు. రవితేజ డిస్కో రాజా, శర్వానంద్ జాను, నాగశౌర్య అశ్వద్ధామ, విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్, కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా, విశ్వక్ సేన్ హిట్ లు మార్చ్ లోగానే పలకరించేశాయి. ఇందులో ఒకటో రెండో కమర్షియల్ గా సేఫ్ కాగా మిగిలినవి డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు వీళ్లందరివి కొత్త సినిమాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. కాకపోతే తేదీలు ఫైనల్ కావాల్సి ఉంది

మొత్తానికి తెలుగు సినిమా ఎన్నడూ ఎదురుకోని సంక్షోభాన్ని 2020లో చూసింది. ఎన్నో సింగల్ స్క్రీన్ థియేటర్లు శాశ్వతంగా మూతబడ్డాయి. వేలాది కుటుంబాలు సరైన ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నాయి. హీరోలకు ఇది ఊహించని పరిణామం. కోట్ల విలువ చేసే కాల్ షీట్స్ ఇంట్లో కిచెన్లకు, రెస్ట్ రూములకు పరిమితమయ్యాయి. దీని ప్రభావం అందరి మీద దారుణంగా పడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిశ్రమకు మంచి రోజులు వీలైనంత త్వరగా రావాలన్నదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp