నాకు తెలిసిన గొల్లపూడి

By Guest Writer Dec. 13, 2019, 09:10 am IST
నాకు తెలిసిన గొల్లపూడి

గొల్లపూడి మారుతీ రావు గారు 80 ఏళ్ల నిండు జీవితం తర్వాత నిన్న డిసెంబర్ 12న కన్ను మూశారు. ఆయన తన జీవితాన్ని తనకు చేతనైనంతగా ఆస్వాదిస్తూ గడిపారు. తనకు ప్రతిభ గల అన్ని రంగాల్లోనూ అవకాశాలు దొరకపుచ్చుకోని గొప్పగా రాణించారు. చివరి నిమిషం దాకా తనకు ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటి రచయితలకు సలహాలివ్వడం,వర్తమాన విషయాల మీద తన అభిప్రాయాల్ని నిస్సంకోచంగా వ్యక్తం చెయ్యడం కూడా కొనసాగించారు. అందుకే ఆయన మరణం తర్వాత అందుకు విచారించడం కంటే నిండు జీవితాన్ని వీలైనంతగా తనకు నచ్చిన విధంగా బతికి, సమాజానికి ఉపయోగపడేలా సాగించి ఎవరికీ కష్టం లేకుండా ముగించినందుకు ఆనందించాలనేది నా అభిప్రాయం.

మొదట కథకుడు, నాటకాలు, నవలల రచయిత అయిన మారుతీ రావు తర్వాతే సినిమా కథలు, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే రాయడం, దర్శకత్వం మొదలు పెట్టారు. ఆలిండియా రేడియోలో కూడా నాటకాలు రాసి రికార్డు చెయ్యడమే కాకుండా కొన్ని స్వయంగా దర్శకత్వం వహించారు. రేడియో జర్నలిస్టుగా పని చేశారు. తర్వాత సినిమా నటుడిగా మారి అందులో కూడా కీర్తి ప్రతిష్టలు పొందారు.

నాకు తెలిసిన ఆయన మొట్టమొదటి రచన 'కళ్లు'.నిజానికి అంతకు ముందు ఆయన సినిమా నటుడిగానే తెలుసు. ఆయన మొదటి సినిమా నేను చూసినది 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'. (ఆయన మొదటగా నటించిన సినిమా కూడా అదే.) అందులో విలన్ పాత్రలో 'దటీజ్ సుబ్బారావు' అనే డైలాగ్ తో సుబ్బారావుగా ఆయన్ని చూసి ఎంతో భయం, అసహ్యం కలిగింది. అంటే ఆయనంత గొప్పగా సహజంగా నటించగలిగాడని తర్వాత అర్థమైంది. తర్వాత ఆయన 250 దాకా సినిమాల్లో నటించినా, హాస్యం, మంచితనం ఉన్న పాత్రలు పోషించినా బాగా గుర్తుండిపోయినవి మాత్రం విలన్ పాత్రలే. ఏ పాత్రలోనూ ఆయన నటించలేదు. ఎప్పుడూ నిజ జీవితంలో అలాగే ఉంటారనేటట్టు ఆయన నటన ఉంటుంది.
ఆయన ఎన్నో గొప్ప కథలు, సినిమా సాహిత్యం రాసినా ఆయన నాటకం 'కళ్లు' మాత్రం నా మీద చెరగని ముద్ర వేసింది. అంధుల జీవితాల గురించిన ఈ కథ ఒక పక్క ఎంతో బాధనీ, విషాదాన్నీ కలిగిస్తూనే ఇంకో పక్క మనలో

మానవత్వాన్ని తట్టి లేపుతుంది. దీన్ని ఎంవీ రఘు నియో రియలిస్టిక్ సినిమాగా తీశారు. ఆ సినిమా అంతర్జాతీయంగా కూడా చాలా ఫిల్మోత్సవాల్లో ప్రదర్శితమై 30 దాకా అవార్డులు గెలుచుకుంది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశంగా కూడా దాన్ని పెట్టారు.

కళ్లు నాటకం చదివిన తర్వాతే నాకు గొల్లపూడి గారి రచనల గురించి ఆసక్తి పెరిగింది. దాంతో ఆయన రచనల కోసం వెతికి చదవడం మొదలైంది. ఆయన అప్పట్లో రాసిన కథలు కొన్ని.. కీర్తిశేషుడు, మృత్యవు ఆత్మహత్య చేసుకుంది, మళ్లీ రైలు తప్పి పోయింది, పిడికెడు ఆకాశం, కాలం కరిచిన కథ లాంటివి చదివాను. ఇంకా ఆయన నాటకాలు, కథలు చాలా మిస్సయ్యాను కూడా. రోమన్ హాలిడే, జుజుమురా, నిద్రపోయే సెలయేరు పేర్లతో గొల్లపూడి రాసిన కథా సంపుటాలు విడుదల అయ్యాయి. 'అమ్మ కడుపు చల్లగా' పేరుతో ఆయన ఙ్ఞాపకాలు రాశారు. ఇది చాలా ఆసక్తికరంగానే కాకుండా చాలా చోట్ల కళ్లు చెమర్చేలా కూడా ఉంటుంది.

అమృతంగమయ, చీకట్లో చీలికలు, సాయంకాలమైంది వంటి నవలలు కూడా గొల్లపూడి రాశారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో గొల్లపూడి 'జీవనకాలమ్' పేరిట 24 ఏళ్ల పాటు ఒక కాలమ్ రాశారు. ఇందులో ఆయన రాసిన వాట్లో అనేక ఆణిముత్యాలు ఉన్నాయి.గొల్లపూడి రచనల్లో రీడబులిటీ గురించి అసలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో ఆయన పాత్రల డైలాగుల్లాగే ఆయన కథలు, సంభాషణలు కూడా చాలా సార్లు అలవోకగా, అనర్గళంగా, చమత్కారంగా, వ్యంగ్యంగా సాగిపోతాయి. కొన్ని సార్లు గుండెలు పిండేస్తాయి. ఆయన రచనల్లో పాత్రలు, కథల కోసం ఎక్కడికో వెళ్లిపోరు. ఆయనది ఊహాలోకం కాదు. మన చుట్టూ ఉన్న కూరలమ్మి, వాచ్ మాన్, మధ్య తరగతి మనుషులు.. వీళ్లే ఆయన కథా వస్తువులు. అందుకే ఆయన రాసేవి కథల్లా, కృతకమైన సినిమా డైలాగుల్లా ఉండవు. మనం రోజూ చూసేవాళ్ల మాటలు, జీవితాల్లాగే అనిపిస్తాయి. అంతే కాదు. అవి మనలో మనం మర్చిపోయామనుకున్న భావనల్ని పైకి తీసి మళ్లీ ఆలోచించేలా చేస్తాయి. మనం ఇంత అనాసక్తతతో ఎందుకు బతుకుతున్నాం? అనిపించేలా చేసి ఏదోకలా సమాజానికి ఉపయోగపడేలా బతకమని చెబుతాయి.

ఈ లక్షణాలు, రీడబులిటీల కారణంగానే గొల్లపూడి రచనలకి, నటనకీ కూడా అనేక అవార్డులు, రివార్డులు, పురస్కారాలు వచ్చాయి. సాహిత్య, సినిమా రంగాల్లో అనేక విజయాలు, కీర్తి ప్రతిష్టలు సాధించారు కాబట్టి గొల్లపూడి జీవితమంతా ఆయన అనుకున్నట్టు, సాఫీగా సాగిందనుకుంటే పొరపాటే. ఆయన చిన్న కొడుకు శ్రీనివాస్ 'ప్రేమ పుస్తకం' అనే సినిమాకి దర్శకత్వం వహిస్తూ వైజాగ్ లో ఆ సినిమా తీసేటప్పుడు సముద్రంలో మునిగి చనిపోయాడు. ఆయన పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని అతని పేరు మీద కొత్త దర్శకులకి స్మారక అవార్డు ఏర్పాటు చేసి ఏటా ఇస్తున్నారు.

ఇటీవల కొంత కాలంగా గొల్లపూడి 'కౌముది' అనే ఇంటర్నెట్ పత్రికలో కాలమ్ రాస్తున్నారు. అందులో చాలా సార్లు వర్తమాన విషయాల గురించి తన అభిప్రాయాలు రాస్తూ వస్తున్నారు. ఆయన అభిప్రాయాలతో అన్నిసార్లూ మనం ఏకీభవించలేకపోయినా, ఆయన కుండ బద్దలు గొట్టినట్టు తన ఆలోచనలు చెప్పే తీరు, రచనా పటిమలకు ఆయన్ని మెచ్చుకోకుండా ఉండడం కష్టం.

తెలుగు భాష బతకాలని ఆయన చేసిన కృషిని కూడా ఎంత ప్రశంసించినా సరిపోదు. తెలుగులో రచనలు చేసేవారిని ప్రోత్సహించడం, రోజూ ఇంట్లో పిల్లలకి తెలుగు భాష, పద్యాలు నేర్పమని చెప్పడం చివరి నిమిషం దాకా ఆయన కొనసాగిస్తూనే వచ్చారు. సాహిత్య, సినీ రంగాల్లో బహుముఖ ప్రఙ్ఞాశాలి అయిన ఆయనంత కృషి మనం చెయ్యలేకపోయినా, ఆయన మాటలు స్ఫూర్తిగా తీసుకుని మాతృభాష మాట్లాడుతూ, పిల్లలకి నేర్పడం, ఆయన సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకోవడం, అందులో చేతనైన వాటిని పాటించడం.. ఇవే మనం ఆయనకు ఇవ్వగలిగిన నివాళి.

Written by --Usha Rani Akella

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp