తెనాలిని ఆంధ్రా ప్యారిస్ అని ఎందుకు అంటారు..?

By Thati Ramesh Sep. 13, 2021, 02:00 pm IST
తెనాలిని ఆంధ్రా ప్యారిస్ అని ఎందుకు అంటారు..?

ఆంధ్రప్రదేశ్ లోని ఫేమస్ ప్లేసెస్ లో తెనాలి కూడా ఒకటి. ప్రాచీన కాలం నుంచి తెనాలి ఖ్యాతి ప్రత్యేకమైనది. వికటకవి గార్లపాటి రామలింగం, తెనాలి రామకృష్ణుడిగానే ప్రసిద్ధికెక్కాడు. ఇంటిపేరు తెనాలి కాకున్నప్పటికీ అదే ఇంటి పేరన్నంతగా తన ప్రతిభతో, తెనాలి కీర్తిని నలుదిశలా చాటారు.

ప్యారిస్ తో పోలిక....

కళల పుట్టినిల్లు, భావోద్యమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నతెనాలికి, ప్యారిస్ కు సారుప్యత ఉండటంతో తెనాలిని ఆంధ్రాప్యారిస్ గా పిలుస్తారు. అవును ఈ పోలిక, పిలుపు నూటికి నూరు పాళ్లు వాస్తవం. ఎందుకంటే భౌగోళిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో ప్యారిస్ కు తెనాలికి మధ్య చాలా విషయాల్లో పోలిక ఉంది. అందుకే తెనాలి ముద్దుపేరు ఆంధ్రా ప్యారిస్.

నాటకాలతోనే పేరు..

బ్యూటిఫుల్ సీటీ అయిన ప్యారిస్... ఫ్యాషన్స్, వినూత్న ఆలోచనలకు పుట్టినిల్లు. అక్కడ చిత్రకారులు కొత్త ధోరణులతో పెయింట్స్ వేస్తుంటే.. కవులు, రచయితలు కొత్త రచనలు చేసేవారు. ఏడాది పొడవునా షేక్స్పియర్ నాటకాలు ప్రదర్శించేవారు. తెనాలిలో కూడా ఇలాంటి వాతావరణమే ఉండేది. ప్యారిస్ లో వలె కాలువలు ప్రవహిస్తూ తెనాలి ఎంతో ఆహ్లాదంగా ఉండేది. తెనాలి మధ్య నుంచి మూడు కాలువలు ప్రవహిస్తూ ఉండటంతో భౌగోళికంగా ప్యారిస్ ను తలపిస్తుంది. పట్టణంలోని మూడు పంటకాలువలు సమాంతరంగా ప్రవహిస్తుండగా వాటి నుంచి మరో మూడు, నాలుగు ఉపకాలువలు కూడా ఇక్కడే విడిపోతాయి. అలాగే సమాజ చైతన్యానికి సాహిత్య, సాంస్కతిక రంగాలలో సృజనాత్మక ధోరణులకు వేదికగా నిలిచింది.

Also Read : కాటమరాజు ఏలిన మా కనిగిరి చరిత్ర తెలుసా..?

చిలకమర్తి పాత్ర...

ఆంధ్రాప్యారిస్ తెనాలిగా నామకరణం చేసిన వారు ప్రఖ్యాత నాటక రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగా చరిత్ర చెబుతోంది. నాటకల్లో స్త్రీ పాత్రలను
పురుషులే పోషిస్తున్న 1930 ప్రాంతంలో చిలకమర్తి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్త్రీ పాత్రలను వారితో మాత్రమే వేయించాలనే సంకల్పంతో పత్రికా ప్రకటన ఇచ్చారు. అప్పుడు తెనాలి నుంచి హర్మోనియం వాయిద్యకారుడు దాసరి నారాయణ స్వామి, 15 ఏళ్ల తన కుమార్తె కాంచనమాల రాజమండ్రి వెళ్లి చిలకమర్తిని కలిసి, నాటకాల్లో నటించేందుకు అంగీకరించారు. ‘సారంగధర’ అనే నాటకంలో కాంచనమాల చాలా సహజంగా నటించి ప్రశంసలు పొందారు. ప్రేక్షకులతో పాటు చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు కూడా కాంచనమాలను అభినందించారు.

స్వేచ్ఛకు ప్రతిరూపం..

‘ఆంధ్రాలో తెనాలి సాంస్కృతికంగా ఎంతో ముందుందని,..అందుకే అక్కడి నుంచి స్త్రీ పాత్రలో నటించేందుకు ముందుకొచ్చారని’ చిలకమర్తి కొనియాడారు. తెనాలిని స్వేచ్ఛకు ప్రతిరూపమైన ప్యారిస్ తో పొల్చవచ్చని వివరించారు. అప్పటి నుంచి ఆంధ్రాప్యారిస్ తెనాలి అని వాడుకలోకి వచ్చింది. ఆ తర్వాత అందాల రాసి కాంచనమాల 11 తెలుగు సినిమాల్లో నటించారు. ’మాలపిల్ల’ సినిమాలో ఆమె అద్భుతంగా నటించారు. కాంచనమాల స్ఫూర్తితో ఎందరో ముద్దుగుమ్మలు నాటక, సినీ రంగాల్లోకి ప్రవేశించి తమ ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించారు.

Also Read : భారత్ లో కలవని బనగానపల్లె

దేశంకోసం...

క్విట్ ఇండియా, జాతియోద్యమాలలో తెనాలి ప్రాంత ప్రజలు కీలక పాత్ర పోషించి ఈ ప్రాంతానికి మరింత ఘనకీర్తి తెచ్చారు. మహాత్మాగాంధీ నాలుగు సార్లు తెనాలిలో పర్యటించారు. 1929 ఏప్రిల్ 20న తెనాలి నడిబొడ్డున ప్రసంగించి ప్రజలను ఉత్తేజ పరిచిన చారిత్రాత్మక ఘటనకు గుర్తుగా ఈ ప్రదేశానికి గాంధీ చౌక్ గా పేరు పెట్టారు. స్వాతంత్ర్య ఉద్యమంలో సమారు 500 మంది చురుకుగా పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో తెనాలి ప్రజలు చూపిన తెగువ ప్రశంసనీయం. అప్పుడు జరిగిన కాల్పుల్లో ఏడుగురు అమరులయ్యారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి రణరంగచౌక్ గా పేరు పెట్టారు. అమరవీరుల స్మృతి చిహ్నాన్ని, చౌక్ ను నిర్మించారు.

సరస్వతీ కటాక్షం..

విద్యారంగంలోనూ తెనాలిది ప్రత్యేక స్థానమే. తెనాలి సీమలో 100పైగా హైస్కూళ్లు ఉన్నాయి. దుగ్గిరాల, కొల్లూరు, తురుమెళ్లలలో వంద ఏళ్ల క్రితమై హైస్కూళ్లు నెలకొల్పారు. 1903లో తెనాలి హైస్కూలును నెలకొల్పగా, 1912లో కొల్లూరు సంస్కృత పాఠశాలను నిర్వహించారు. ఈ ప్రాంతం నుంచి డజను మందికి పైగా వైస్ ఛాన్సలర్లుగా నియమితులయ్యారు. ఇక్కడ నుంచి సినిమా రంగం వైపు వెళ్లిన వారు సుమారు 150 మంది వరకు ఉంటారు. తెనాలి నుంచి తెరపైకి వచ్చిన వాళ్లలో గుమ్మడి, జమున, కృష్ణ, జగ్గయ్య, ఏవీఎస్, పీఎల్ నారాయణ వంటి ప్రముఖులు ఉన్నారు.

తెఱఇలి నుంచి తెనాలి..!

దావులూరులో లభ్యమైన 11వ శతాబ్దానికి చెందిన శాసనంలో తెనాలి పేరు ఉంది. పరుశరామ ప్రతిష్టగా చెప్పే శ్రీరామలింగేశ్వరాలయంలో 1510లోని స్వామి ఉత్సవ విగ్రహపీఠంపై లేఖనంలో కూడా తెనాలి పేరు స్పష్టంగా ఉంది. తెనాలికి ఆ పేరు ఎలా వచ్చిందనే దానిపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తెనాలి అంటే సర్వకర పరిహారంగా ఇచ్చిన భూమి.. అంటే ఎలాంటి పన్నులు లేకుండా ఇచ్చిన గ్రామమని అర్ధం. కృష్ణా నదిని గొడవర్రు దగ్గర దాటి, దక్షిణం వైపునకు వెళ్లే వర్తక బిడారుల మార్గాలు రెండు ఉండేవని... ఆ రెండింటిని కలిపే కూడలి అయినందున తెనాలి అయి ఉండవచ్చనే మరో అభిప్రాయం కూడా ఉంది. కృష్ణా నది పాయ మున్నంగి దగ్గర బంగాళాఖాతంలో కలిసే వరకు అయిదు చోట్ల శివాలయాలు పంచావళీ క్షేత్రాలుగా ప్రసిద్ది చెందాయి. ఇందులోని తెఱఇలి .. క్షేత్రమే తెనాలి అనే కథనం కూడా ఉంది.

Also Read : పరిటాల అనే స్వతంత్ర దేశం తెలుసా...?

పంచాయతీ నుంచి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ...

1904లో కృష్ణా జిల్లా నుంచి గుంటూరు ప్రాంతాన్నివిభజించి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. 1909 అక్టోబర్1న తెనాలికి మున్సిపాలిటి హోదా కల్పించారు. అప్పుడు తెనాలి జనాబా 10 వేల వరకూ ఉండగా, విస్తీర్ణం 6.94కిలోమీటర్లుగా ఉండేది. 1911లో తెనాలి కేంద్రంగా రేపల్లె, పొన్నూరు, బాపట్లతో కలిసి రెవెన్యూ డివిజన్ ఏర్పడింది. 1961 మార్చి16న స్పెషల్ గ్రేడ్ హోదా పొందింది. అప్పటి విస్తీర్ణం 15.11 చదరపు కిలోమీటర్లు. గుంటూరు జిల్లాలోని ఏకైక స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటిగా తెనాలి రికార్డులకెక్కింది.

పురపాలిక తొలి చైర్మన్ గా పి. నాగేశ్వరరావు పంతులు నామినేట్ అయ్యారు.1920 లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో న్యాయవాది చెమిటిగంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ఎన్నికయ్యారు. తర్వాత పిల్లలమర్రి ఆంజనేయ పంతులు, కవిరాజు త్రిపురనేని రామస్వామి చైర్మన్ గా సేవలందించారు.1949లో జరిగిన ఎన్నికల్లో నన్నపనేని వెంకట్రావు చైర్మన్ గా నియమితులయ్యారు.

వారసత్వ రాజకీయాలు..

ప్రస్తుతం తెనాలి నియోజవర్గ ఎమ్యెల్యేగా అన్నాబత్తుని శివకుమార్ ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటి చేసిన శివకుమార్, టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై విజయం సాధించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మూడో స్థానంలో నిలిచారు. 2014లో టీడీపీ తరఫున ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలవగా.. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి నాదెండ్ల మనోహర్ గెలిచి డిప్యూటీ స్పీకర్ గా, స్పీకర్ గా పనిచేశారు. 1989లో మనోహర్ తండ్రి, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి నెగ్గారు. ప్రస్తుత ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తండ్రి సత్యనారాయణ రెండు పర్యాయాలు అంటే 1983లో స్వతంత్ర అభ్యర్థిగా, 1985లో టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దొడ్డపనేని ఇందిరపై విజయం సాధించారు. నియోజకవర్గ రాజకీయాలను పరిశీలించినప్పుడు వారసత్వ రాజకీయాలే ఎక్కువగా సాగుతున్నట్లు అర్ధమవుతోంది.

Also Read : దేశంలోనే మొదటి హరికథా పాఠశాల ఏపీలో ఎక్కడ ఉందో తెలుసా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp