ఎదురు కట్టె సేతబట్టి చిత్తా గట్టె తిప్పడం మొదులుపెడ్తే!

By Vivek Segileti May. 14, 2020, 10:15 pm IST
ఎదురు కట్టె సేతబట్టి చిత్తా గట్టె తిప్పడం మొదులుపెడ్తే!

"ఒరెబ్బీ లాకు డౌనని ఇంటికొచ్చినాంచి సూచ్చాండా ఆ సెల్లు ఫోను తప్ప ఇతరం లోకమేమన్నా ఉందారా మీకు.. ఇంటికెవురన్నా మాసులొచ్చినా పట్టిచ్చుకోరు తిండితిప్పలు మాని ఏమిరా మీకు పొయ్యేకాలం" తన మనమల్ల మీద విసుక్కున్నాడు జయన్న.

"ఇంగేంజెయ్యాల అబ్బా.. బయటికిబొయి ఆడికుందామంటే ఎండలకు తట్టుకోలేమని మాయమ్మ బయటికి పంపియ్యకపోయె ఆ టీవి ఎంత సేపని జూసేము" అంతే గడుసుగా సమధానమిచ్చాడు పెద్ద మనమడు.

"అట్టాగాదురా ఎంత సేపు ఆ ఫోన్లోకే దూరుకోనుంటే ఏమొచ్చది నాయనా మనుషుల్తో మాట్లాడితే జీవితం తెలుచ్చది, బయటిపొయి ఆటలాడ్తే మనుసు, శరీరం గూడా దిట్టబడ్తాయి.

అదే మీ వొయిసులో మేమైతేనా మాంచి ఎదురు కట్టె సేతబట్టి చిత్తా గట్టె తిప్పడం మొదులుపెడ్తే దీనెక్క గంట సేపయినా కట్టె ఏళ్ల మింద అట్నే ఆడ్తాండాల. కర్ర సామైతే అవతలి పక్క మాంచి ఉద్దిగిన తగల్తే ఒక బంగిట సల్లిడ్సేదిల్యా. అట్టాడ్ది మీరేంది బాయిలర్ కోళ్ల మాద్దిరి ఉత్త సల్లు పిలకాయలే" తన చిన్నతనపు ఆట విడుపులను గుర్తు చేసుకుంటూ చెప్పాడు.

"ఏందిబ్బా.. చిత్తా కట్టేంది, కర్ర సామంటే ఏంది" ఆశ్చర్యంగా అడిగాడు తొలిసారి ముసిలాయప్ప నోటినుండి వింటున్న మాటలు అర్థం గాక.

చిత్తా కట్టెంటే ఒక అయిదారు అడుగుల వెదురు కర్రొకటి తీసుకుని మధ్యలో పట్టి వేళ్ల మధ్యన మార్చుకుంటూ గిర్రున గాలిపటం మాద్దిరి తిప్పే వాళ్లం. కుడి చేతిలోంచి ఎడమ చేతికి, ముందు నుంచి వెనక్కు, అటు నుంచి ఇటు గిరగిరా తిప్పుతాంటే దీనెక్క మాంచి వాటమైనోడైతే తిప్పే చేతులు, భమ్మంటూ వినపడే గాలి తప్ప కట్టెనేదే కనపరాదనుకో.

ఇంగా కొంత మంది పోటు మొగోళ్లయితే మోకాళ్ల మింద గొంతుక్కూచ్చుని కాళ్ల కింది నించి తప్పిచ్చా నేలమింద కట్టె గిర్రున తిప్పుతాంటే ఊరంతా ఊలలే ఊలలు, అరుపులే అరుపులనుకో అట్టా ఉంటాన్నెది యవ్వారం.

ఇంగ కర్ర సామైతే నా సామిరంగా ఏముంటాన్నెదిలే. బాగా చేతి వాటముండి ఎవుర్నైనా పడగొట్టే వాన్నైతే పాలెగాని మాద్దిరి లెక్కేచ్చారు సుట్టుపక్కల పల్లెల్లో.

దాంట్లో గూడా నాలుగైదు రకాలుండాయి మళ్లా. వెదురు కట్టెకు ఒక కొస్సన సున్నం పూసి అల్లెలోకి దిగి ఎదుటోన్తో తలపడాల. ఎవుడైతే ఒడుపుగా ఎదుటోడి తలకు సున్నం తగిలిచ్చాడో వాడే గెల్సినట్టు. కొన్నిసార్లు మంచి ఒడుపైనోళ్లుగిన తలపడ్న్యారంటే పొద్దన్నించి మజ్జానం దాకా ఆడ్తానే ఉంటారు. కట్టెలిరగనన్నా ఇరగాల ల్యాకుంటే ఇంగ ఇది కుదిరేది కాదని ఇద్దరూ వొదులుకోనన్నా వదులుకోవాల. అంతగా రంజుగా సాగేటిటియి.

నా హయాంలో సూడ్లేదు గానీ మా నాయనోళ్ల తరంలో ఒక ఊరికి మరొక ఊరికి కూడా పోటీలు కూడా ఉండేటియంట అని ముసిలాయప్ప చెప్పుకుంటూ పోతుంటే చిన్న మనమడు కట్టె తెచ్చి ముందేసిండు చిత్తా కట్టె నేర్పించుబ్బా అంటూ..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp