ఆహారమే ఆరోగ్యం అట గురువు గారూ

By Su Sri-Sagar Jan. 13, 2020, 07:55 pm IST
ఆహారమే ఆరోగ్యం అట గురువు గారూ

కొనకనమిట్ల ఆఫీస్ వెనక గెస్ట్ హవుస్ లో తూగుటుయ్యాల మీద కూర్చొని కూనిరాగాలు తీస్తూ క్యారేజ్ ఓపెన్ చేశారు గు గా . ఘుమ ఘుమ లాడుతూ కొత్తిమీర పచ్చడి , నూనెలో మెరుస్తున్న గుత్తోంకాయ , దొండకాయ ఫ్రై , పైన ఎర్రెర్రగా నూనె తేలుతూ మజ్జిగ చారు కళ్ళ ముందు కనపడేసరికి ఆకలి రెట్టింపు అయ్యింది . పాంట్ బెల్ట్ తీసి కుండకి కాస్త సళ్లిచ్చి తీరిగ్గా దాడి మొదలెట్టారు .

పచ్చడిలో నుండి గుత్తి వంకాయలోకి వచ్చేసరికి ఉరుము లేని పిడుగులా ఒకతను రూంలోకొచ్చి ఎదురుగా కూర్చున్నాడు . సహజంగా తినెప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే విపరీతంగా చిరాకు పడే గు గా అంతే చిరాకుతో తల పైకెత్తి ఎదో అనబోయి ఎదురుగ్గా ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారు .

"నమస్కారం మంతెన గారూ మీరా , ఏంటి సర్ సడెన్ గా షాక్ ఇచ్చారూ , రండి భోజనం చేద్దాం" .
"నేను బూడిద గుమ్మడి గింజలు నానేసి , కొత్తిమీర రసంలో కలిపి భోజనం కానిచ్చాలే మీరు తినండి . మీతో చిన్న పని ఉండి వచ్చాను".
"చెప్పండి సర్ చేసేద్దాం" .
"మరేం లేదు మన పాత ఆశ్రమం అక్రమ కట్టడం అని పడేస్తామంటున్నారు . ఇంకో ఆశ్రమం గుండ్లకమ్మ ఒడ్డున కడదామని 360 గజాల స్థలం తీసుకున్నాను . అందులో 13 ప్లోర్లు ప్లాన్ ఇవ్వమంటే అందరూ అంత తక్కువ స్థలంలో ప్లాన్ ఇవ్వలేం అందుకు సమర్ధుడు సు శ్రీ నే అని నీ పేరు చెప్పారు" ...అంటూ జుర్రు జుర్రు అని ఎదో జుర్రుతున్న శబ్దం వినపడగానే దీక్షగా చెప్తున్న విషయం ఆపి చూస్తే గు గా మజ్జిగ పులుసు అంతు చూసే పనిలో ఉన్నారు . తదేకంగా చేతికి అంటుకున్న ఆయిల్ ని చూసి అలాగే గుత్తి వంకాయ కూరలో ఉన్న ఆయిల్ కూడా గమనించి అదేంటయ్యా సు శ్రీ ఆ ఆయిల్ ఫుడ్ ఏంటి , అంత కార్బోహైడ్రేట్ తింటే బీపీ , షుగర్స్ తన్నుకొంటూ వచ్చేస్తాయి . గుండె పోటు కూడా రావొచ్చు .
"నేను ఇంట్లో మొత్తుకొంటాను సర్ , కాస్త ఆయిల్ తగ్గించి లైట్ ఫుడ్ పెట్టవే అని మా గుండమ్మ నా మాట వింటేనా"
"వినకపోతే ఎలాగయ్యా సరైన ఆహారమే ఆరోగ్యం , ఆహారమే వైద్యం. నేను కూడా మీ ఇంటికి వస్తాను పద మేడం గారికి నేను వివరంగా చెప్తా"

ఇహ ఈయన ప్లాన్ కి డబ్బులు ఇవ్వడు అని మనసులో ఫిక్సయ్యి సర్లే ఆరోగ్యం అన్నా బాగుపడుతుంది అనుకోని చకా చకా పనులు ముగించి ప్లాన్ గీసి మంతెనకిచ్చి ఇరువురూ బయల్దేరి ఒంగోలు వచ్చారు .

నమస్కారాలు , కుశల ప్రశ్నలు అయిపోయాక మజ్జిగ తాగుతూ విషయంలోకొచ్చారు మంతెన .
"మధ్యాహ్నం మీ వారు భోజనం చేస్తుంటే గమనించానమ్మా , ఫుడ్ లో ఉన్న ఆయిల్ భారీగా చేతికి అంటుకొని ఉంది అది కడగడానికి సోప్ వేసి ఐదు నిమిషాలు పట్టింది . కనపడే చేతికి ఐదు నిమిషాలు పట్టింది . మరి కనపడకుండా పేగులకి అంటుకుపోతున్న ఆయిల్ ఎలా కడుగుదామమ్మా , అలా పేరుకొని పేరుకొని అది ఎన్ని అనారోగ్యాలకు దారి తీస్తుందో తెలుసా తల్లీ" అన్నారు మంతెన .
"సమస్య అర్థమైంది సర్ , ఈ రోజు నుండి జాగ్రత్త పడతాను . అలా ఆయిల్ పేరుకోకుండా చక్కగా వండిపెడతాను ".
"నేను పరిష్కారం చెప్పకుండా నీకెలా అర్ధమైందమ్మా" .
"ఈయన సాహచర్యంలో ఏకసంథాగ్రాహి నయ్యాలేండి . అన్నట్టు ఈయన రాత్రి భోజనం చేయరు చపాతీలే , మీక్కూడా అవే చేయనా"
"నాక్కూడా అవే చేయి తల్లీ"

"స్టఫ్డ్ మేథీ పరోటా చేస్తా" అంటూ వంట పని మొదలెట్టి అరగంటలో ముగించింది గుండక్క . కొంచెం ఆయిలీగానే ఉన్నాయి , ఇదేంటి మళ్లీ ఆయిలా అన్నట్టు చూసారు మంతెన
"మరేం పర్లేదు సర్ లైట్ ఆయిల్ అదీ పేగులకి అస్సలు అంటుకోదు ధైర్యంగా తినండి" అంది గుండక్క .
ఇరువురూ రుచి మెచ్చుకొంటూ చెరి నాలుగు లాగించారు . మరి కాసేపు ముచ్చట్లు అయ్యాక మరికొన్ని జాగ్రత్తలు చెప్పి బయల్దేరిన మంతెన కార్ డోర్ పట్టుకొని ఎక్కబోతూ కడుపు పట్టుకొని కూలబడ్డారు . అరెరే అంటూ ఆయన్ని పైకి లేపబోయిన గు గా కూడా అంతే కడుపు పట్టుకొని కూలబడ్డారు .
అంబులెన్స్ వచ్చింది , హాస్పిటల్ లో డాక్టర్ గారి ఎదురుగా గుండక్క కూర్చొంది .
"వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యింది మేడం . ఎం తిన్నారు".
"మరేమో మంతెన గారు ఫుడ్ లో ఆయిల్ పేగులకి అంటుకొని ఆరోగ్యం పాడవుతుంది అన్నారు . అలాగే ఫుడ్ లో ఫైబర్ కావాలన్నారు" .
"అంటే ".
"ఫైబర్ కోసం కొబ్బరి పీచు మిక్సీ పట్టి కర్రీలో కలిపా , పేగుల్లో ఆయిల్ క్లియర్ అవ్వటం కోసం పరోటా పిండి సర్ఫ్ నీళ్లతో కలిపా , రిన్ సబ్బు కూడా చిన్న చిన్న ముక్కలు వేశాననుకోండీ .

డాక్టర్ : @$$%&$^@౩౬౫%&$&#*#%&

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp