తిరుప‌తి ల్యాండ్‌మార్క్స్ - రెడ్డెమ్మ‌, శీన‌య్య మెస్‌లు

By G.R Maharshi Dec. 16, 2019, 12:39 pm IST
తిరుప‌తి ల్యాండ్‌మార్క్స్ - రెడ్డెమ్మ‌, శీన‌య్య మెస్‌లు

చిత్తూరు జిల్లా చేప పులుసు, నాన్ వెజ్ తినాలంటే తిరుప‌తి భేరివీధిలోని రెడ్డెమ్మ మెస్‌కు వెళితే చాలు. లోప‌లికి అడుగు పెడితే ఒక పెద్దావిడ ప్రేమ‌గా ప‌ల‌క‌రించి ఏం కావాలో అడిగి మ‌రీ వ‌డ్డిస్తుంది. వండ‌డం , వ‌డ్డించ‌డం అంతా ఆమె కుటుంబ స‌భ్యులే చేస్తారు. నేను తిరుప‌తిలో దాదాపు 20 ఏళ్లు ఉన్నాను. ఈ మెస్‌లో ఎన్నోసార్లు తిన్నాను. ఎప్పుడూ ఒక‌టే రుచి. రెడ్డెమ్మ అదే ప‌ల‌క‌రింపు.

సౌమ్యంగా ఉండే రెడ్డెమ్మ‌లో ఒకోసారి తిరుప‌తి గంగ‌మ్మ ఉగ్ర‌రూపం చూశాను. మెస్‌కి ఒక తాగుబోతు వ‌చ్చి గొడ‌వ‌కి దిగాడు. త‌గినంత చేప పులుసు వేయ‌లేద‌ని ర‌చ్చ‌. అత‌ని కోసం ఒక Bowl నిండా చేప పులుసు ఇచ్చి నీకెంత కావాలో వేసుకుని తిన‌య్యా , నాకు డ‌బ్బుల కంటే అంద‌రూ క‌డుపు నిండా తిన‌డ‌మే ముఖ్య‌మ‌ని చెప్పింది. అయినా వాడు విన‌లేదు. అంతే శాంతంగా ఉన్న ఆమె క‌ళ్లు రౌద్రంగా మారిపోయాయి. తాగుబోతు చెంప ప‌గిలిపోయింది. ఎంత గ‌ట్టిగా కొట్టిందంటే వాడు రెండుమూడు టేబుళ్ల మీద ప‌డిపోయాడు. కాల‌ర్ ప‌ట్టుకుని బ‌య‌ట‌కు ఈడ్చి "రెడ్డెమ్మ ముంద‌ర త‌ప్పు మాట్లాడుతావా నా బ‌ట్టా " అని తోసేసింది.

గంభీరంగా క‌నిపించే రెడ్డెమ్మ గుప్తంగా ఎంద‌రికో సాయం చేస్తుంది. అనాథ పిల్ల‌ల‌కి ప్ర‌తినెలా బ‌స్తా బియ్యాన్ని పంపిస్తుంది. తిరుప‌తి వెళితే రెడ్డెమ్మ మెస్‌కి వెళ్లండి లోక‌ల్ రుచి తెలుస్తుంది.

ఇక రెడ్డెమ్మ మెస్ ప‌క్క‌నే శీన‌య్య మెస్‌. 1988లో నేను మొద‌టిసారి తిన్న‌ప్పుడు మ‌ట‌న్‌తో క‌ల‌సి భోజ‌నం రూ.7. ఇపుడు వంద దాటి ఉంటుంది. మ‌ట‌న్ గ్రేవీ తింటే మ‌ళ్లీ మ‌రిచిపోలేం. త‌లకూర అదిరిపోతుంది.
వీళ్ల ప్ర‌త్యేక‌త ఏమంటే ఇద్ద‌రూ క‌ట్టెల పొయ్యి మీదే వండుతారు. ఈ రెండు మెస్‌ల‌కి కొత్త‌వాళ్లు త‌క్కువ‌. అంతా లోక‌ల్స్‌. కోర్టు కేసుల కోసం చుట్టుప‌క్క‌ల ప‌ల్లెల వాళ్లంతా మ‌ధ్యాహ్నం ఇక్క‌డికే.
తిరుప‌తి యాస, రుచి రెండూ నోరూరిస్తాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp