YSR Awards - గౌతమి గ్రంథాలయానికి వైఎస్సార్‌ జీవిత సాఫల‍్య పురస్కారం

By Aditya Nov. 01, 2021, 10:50 am IST
YSR Awards - గౌతమి గ్రంథాలయానికి వైఎస్సార్‌ జీవిత సాఫల‍్య పురస్కారం

లక్షకు పైగా గ్రంథాలకు నిలయమైన రాజమహేంద్రవరంలోని శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయం వైఎస్సార్‌ జీవిత సాఫల‍్య పురస్కారం సోమవారం అందుకోనుంది. ఏళ్ల చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకొని.. స్వాతంత్య్రానికి పూర్వమే అతి పురాతనమైన గ్రంథాలయంగా ఇది పేరు గాంచింది. రచయిత, సంఘ సంస్కర్త నాళం కృష్ణారావు 1898లో నాళం వారి సత్రంలో కొన్ని గ్రంథాలతో దీన్ని ప్రారంభించారు. 1898 వరకూ ప్రైవేటు గ్రంథాలయాలుగా సేవలందించిన శ్రీ కందుకూరి లైబ్రరీ, అద్దంకి సత్యనారాయణ వసురాయ లైబ్రరీలు విలీనమై 1920లో శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంగా రూపుదిద్దుకున్నాయి. సొసైటీ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ ప్రకారం దీన్ని రిజిస్టర్‌ చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య, ఏబీ నాగేశ్వరరావు దీనికి ప్రాంతీయ హోదా తేవడానికి కృషి చేశారు. 1979లో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది. వివిధ రకాలు గ్రంథాలను సేకరించి దీని విస్తృతిని పెంచాక రాజమహేంద్రవరంలోని టౌన్‌హాల్‌కు గౌతమీ గ్రంథాలయాన్ని తరలించారు.

ఎన్నెన్నో గ్రంథాలు..

ఆంధ్ర, ఆంగ్ల భాషలకు చెందిన గ్రంథరాజాలెన్నో ఇక్కడ మనకు లభిస్తాయి. షేక్‌స్పియర్‌ సాహిత్యం పాత ప్రతులు కూడా ఇక్కడ లభ్యమవుతాయి. 12వ శతాబ్దానికి చెందిన గ్రంథాలు, వంద సంపుటాలుగా వచ్చిన గాంధీజీ రచనలు, అల్లూరి సీతారామరాజు రచనలు కూడా ఉన్నాయి. ఇక్కడ లక్షల రూపాయలు పెడదామన్నా లభించని అరుదైన గ్రంథాలు 1,05,000 వరకూ లభ్యమవుతాయి. ఇందులో 15,000 గ్రంథాలు బాగా అరుదైనవి. 19 శతాబ్దానికి ముందు అచ్చయినవి 1,500 పుస్తకాలు, 1923 సంవత్సరానికి ముందు వచ్చినవి 8,115, 1950కి పూర్వం ‍ప్రింట్‌ అయినవి 5000 వరకు గ్రంథాలు ఉన్నాయి. తెలుగు గ్రంథాలు 71,130, ఇంగ్లీషు 21,974, హిందీ 7,967, ఉర్దూ 372, ఇతర గ్రంథాలు 667 ఇక్కడ లభ్యమవుతున్నాయి. 411 తాటాకు రాత ప్రతులు, సాహిత్యం చెక్కిన రాగి రేకు ప్రతులు 6, అచ్చుకాని చేతిరాత ప్రతులు 40  వరకు ఉన్నాయి. రాజరాజనరేంద్రుని పుస్తకాలు, పురాతన పంచాంగాలు, 1771లో అ‍చ్చయిన ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ బ్రిటానికా వంటి ప్రతులకు నిలయంగా ఈ గ్రంథాలయం ఉంది. తమిళనాడులోని తంజావూరు గ్రంథాలయం తర్వాత అతిపెద్ద ప్రాంతీయ గ్రంథాలయం ఇదే. అందుకే ఎందరో రీసెర్చ్‌ స్కాలర్లకు ఇది స్వర్గధామంగా విలసిల్లుతోంది.

ఎందరో ప్రముఖుల సందర్శన

ఈ గ్రంథాలయానికి తమ సాహితీ దాహాన్ని తీర్చుకోవడానికి ఎందరో ప్రముఖులు వస్తుండేవారు. జయపూర్‌ సంస్థానానికి చెందిన మహరాజా విక్రమదేవవర్మ, ధర్మవరం ఎస్టేట్‌కు చెందిన రాజా కంచుమర్తి రామచంద్రరావు, సాహితీ స్రష్టలు చిలకమర్తి లక్ష్మీ నరసింహం, భమిడిపాటి కామేశ్వరరావు, కాశీనాథుని నాగేశ్వరరావు, కట్టమంచి రామలింగారెడ్డి, పాతూరి నాగభూషణం తరచు ఈ గ్రంథాలయానికి వచ్చేవారు.

సీఎం నిర్ణయంపై హర్షం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా సామాన్యుల్లో అసామాన్య ప్రతిభను గుర్తించి, వారిని సత్కరించాలని యోచించడంపై సర‍్వత్రా హర‍్షం వ‍్యక‍్తమవుతోంది. వైఎస్సార్‌ పేరిట విభిన్న రంగాల నుంచి ఎంపిక చేసిన  ప్రముఖులను సత్కరించేందుకు రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్‌ ఒకటో తేదీ ముహూర్తంగా నిర్ణయించారు. కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలతో పాటు విశిష్ట సేవలందించిన సంస్థలను కూడా ఈ పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసింది. గత ఆగస్టులోనే అత్యంత పారదర్శకంగా ఎంపిక పూర‍్తయింది. కోవిడ్‌ కారణంగా పురస్కార ప్రదాన ఉత్సవాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రస్తుతం కోవిడ్‌ తీవ్రత తగ్గడంతో పురస్కారాలు అందజేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఉదయం 11 గంటలకు విజయవాడలోని ఏ. కన్వెన్షన్‌ సెంటర్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవార్డును అందజేయనున్నారు. గౌతమీ గ్రంథాలయానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సాహితీప్రియులు స్వాగతిస్తున్నారు.

Also Read : RK Kothapaluku - రాతల్లో నీతులు.. ముఖ్యమంత్రులకు గోతులు..  

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp