వివేకానంద స్వామి జయంతి

By Guest Writer Jan. 12, 2020, 08:22 am IST
వివేకానంద స్వామి జయంతి

బలమే జీవనం బలహీనతే మరణం అన్నట్టి స్వామి వివేకానందుల ప్రవచనంలో ఈవాక్యం చిన్నదైనా అందులోని అర్ధం అనంతమైనది.

1863 సంవత్సరంలో జనవరి నెల12 వ తేదీ సోమవారం కలకత్తాలో పుణ్యదంపతులైనట్టి విశ్వనాధ దత్తా భువనేశ్వరిలకు స్వామి వివేకానందుల వారు జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు నరేంద్రుడు అని పేరు పెట్టారు. బాల్యం నుండి ఆయనలో ధైర్య సాహసాలు, నిరుపమాన దీక్షాశక్తి ఎక్కువగానే ఉన్నాయి. కళాశాలలో చదువుతుండగా తన తండ్రిగారు మరణించటంతో కుటుంబ భారం ఆయనపైన పడినది.దత్త కుటుంబీకులు సంఘంలో గొప్ప పేరుప్రఖ్యాతలున్నవారు, దాతృత్వం కలిగి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను కాంక్షించే వారు,ఇక నరేంద్రుడి తాత అయినట్టి దుర్గాచరణ్ దత్త పర్షియన్, సంస్కృతభాషలలో పాండిత్యము కలిగిన న్యాయవాది, విశ్వనాధ్ జన్మించన తర్వాత దుర్గా చరణ్ సన్యసించారు,అప్పుడు అయనకి వయసు 25 సంవత్సరాలు లోపు మాత్రమే. "సింహంలాంటి" తన రూపానికి తగ్గ ధైర్యం కలిగి ప్రకాశమానమైన బుద్ధిని కలిగివుండేవాడని ,అక్షరాలా నిజం.

నరేంద్రనాథ్ అనేకమంది పెరెన్నికగన్న మత నాయకులను కలుసుకున్నాడు. వాస్తవంగా వారెవ్వరూ, "దేవుడు ఉన్నాడా "లేడా ? అన్న అతని ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదు, ఇది అతని ఆధ్యాత్మిక అశాంతిని మరింతగా పెంచి ఇటువంటి చిక్కుపరిస్థితిలో, కలకత్తాకు కొద్ది దూరంలో, దక్షిణేశ్వరంలో ఒక సాధువు ఉన్నాడని తన ఆచార్యుడైన విలియం హేస్టీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వర్డ్స్ వర్త్ తన "విహారము" అన్న కవితలో వర్ణించిన పారవశ్యస్థితిని ఆ ’సాధువు అనుభూతి చెందాడని హేస్టీ వివరించాడు. ఆ విధంగా 1881 లో ఆధునిక భారతదేశపు దివ్యద్రష్ట అయిన శ్రీరామకృష్ణులకి స్వామికి పరిచయం కలిగింది. తొలిసారి తన గురువు రామకృష్ణ పరమహంసను కలువగానే,రామకృష్ణ గారు మాట్లాడుతూ స్వామితో ఇలా అన్నారు ఏంత కాలమునకు వచ్చితివోయి,ఇంత కాలం నాపై నీకింత నిర్దాక్షిణ్యమేలనయ్యా ,ప్రపంచ ప్రజల తుచ్చమైన ప్రసంగాలతో నా చెవులు చిల్లులు పడుచున్నవి నాయనా, నీవు నరుడనబడే సనాతన ఋషివి,మానవజాతిలో బాధలను రూపుమాపుటకై అవతరించిన నీవు నిజంగా నారాయణుడవు అని అంటూ వివేకానందని ఆనందముతో ఆలింగనము చేసుకున్నారు.

ఆప్పుడు స్వామి తనగురువు శ్రీరామకృష్ణుల వారితో ఇలా అడిగినాడు "అయ్యా! మీరు దేవుణ్ణి చూశారా ? "అందుకు "ఔను ! నేను భగవంతుణ్ణి చూశాను!నిన్నిప్పుడు చూస్తున్న దానికన్నా స్పష్టంగా చూశాను!"అని స్వామికి శ్రీరామకృష్ణులు సమాధానమిచ్చారు.స్వామికి నాడు తన సొంత అనుభూతి ద్వారా దేవుణ్ణి దర్శించిన ఒక మనిషి లభించాడు. స్వామికి అనుమానం తొలగిపోయింది,ఇక శిష్యునిగా శిక్షణ ప్రారంభం శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి అనేకరకాలుగా పరీక్షించారు. దానికి ప్రతిగా, శ్రీరామకృష్ణులు తాను అనుభూతి చెందినట్టు వర్ణించిన ఆధ్యాత్మికస్థితులలో నిజం ఎంత వరకు ఉందో తెలుసుకోవడానికి ఆయనను అనేకవిధాలుగా నరేంద్రుడు కూడా పరీక్షించి చూశాడు. క్రమక్రమంగా నరేంద్రుడు తన గురుదేవులకు శరణాగతుడయ్యాడు. తన అంతులేని ఓరిమితో శ్రీరామకృష్ణులు తన యువ శిష్యుని యొక్క సంప్రదాయ వ్యతిరేక ధోరణిని అణగార్చి, సంశయస్థితిలో నుంచి దృఢనిశ్చయానికి, ఆవేదన నుండి ఆధ్యాత్మిక ఆనందానికి అతనిని తీసుకొనిపోయారు. కానీ శ్రీరామకృష్ణులందించిన మార్గదర్శకత్వం కన్నా ఆయన ప్రేమయే ఆ యువ శిష్యుని మనస్సును మరింతగా చూరగొన్నది.

అదే ప్రేమను అంతే నిండుదనంతో ఒక శిష్యుడిగా తిరిగి గురువుకు అందించాడు,తన గురువు శ్రీరామకృష్ణులు జబ్బుపడినప్పుడు ఆయనకి చికిత్స కోసం ఆయనని కలకత్తా పొలిమేర్లలో కాశీపూర్ కు తరలించారు. అక్కడనే తన గురువు ఆధ్వర్యంలో నరేంద్రుడి చివరి విడత శిక్షణాకార్యక్రమం మొదలైంది.ఆ సమయంలో నరేంద్రుడు చాలా తపస్సాధనలను చేశాడు. శ్రీరామకృష్ణులు తమ యువ శిష్యులందరిని నరేంద్రుడి నాయకత్వంలోకి తేవడానికి కృషి చేశారు. నరేంద్రుడు తనకు సర్వోత్కృష్ట పారమార్థికస్థితి అయిన నిర్వికల్ప సమాధిని ఇవ్వమని శ్రీరామకృష్ణులను కోరినప్పుడు ఆయన, "సిగ్గులేదా! నువ్వొక పెద్ద మర్రి చెట్టు లాగా పెరిగి, ఈ ప్రపంచపు బాధలలో మాడి పోతున్న వేలమందికి నీవు ఒక నీడనిస్తావని నేననుకుంటున్నాను. కానీ ఇప్పుడు చూస్తే నువ్వు నీ మోక్షాన్నే కోరు కుంటున్నావు" అని మందలించారు. అయినప్పటికీ నరేంద్రుడికి అనన్యసామన్యమైన అనుభూతి సిద్దించింది. కానీ, నువ్వు జన్మించిన కార్యం సిద్దించేవరకు ఆ అనుభూతికి చెందిన తాళంచెవి నా దగ్గరే ఉంటుందని గురుదేవులు అతనికి చెప్పారు.

తన మహాసమాధికి మూడునాలుగురోజుల ముందు శ్రీరామకృష్ణ గురుదేవుల వారు తన ఆధ్యాత్మికశక్తినంతా నరేంద్రుడికి ధారపోసి, "ఇప్పుడు నీకిచ్చిన శక్తితో మహాత్కార్యాలు సాధించబడతాయి", దాని తర్వాతే నువ్వు నీ ధామానికి చేరుకుంటావుని గురువుదేవులు చెప్పారు, గురుదేవులు 1886 వ సంవత్సరం ఆగస్టునెలలో మహాసమాధి చెందిన తర్వాత నరేంద్రుడి నాయకత్వంలో శిష్యులందరూ బారానగర్లో సన్న్యాసదీక్ష తీసుకున్నారు. నరేంద్రుడు భారానగర్ లో గడిపిన దినాలన్ని అధ్యయనంలోనూ, ఆధ్యాత్మికసాధనలతో మహదానందంగా గడిచాయి. కానీ స్వామికి పరివ్రాజక జీవితం గడపాలన్న ఒక కోరికతో నరేంద్రుడు కూడా 1888 చివరిభాగం నుంచి అనేకసార్లు మఠం విడిచి యాత్రలకు చేశారు.

పరివ్రాజక సన్యాసిగా స్వామి తాత్కాలికమైన యాత్రలు ప్రారంభించిన 1888 చివరిభాగం నుంచి 1890లో తన సోదరబృందాన్ని కూడా పూర్తిగా విడిచిపెట్టి ఊరూపేరూలేని బైరాగిగా పర్యటించడం ప్రారంభించిన తర్వాత జరిగిన కాలంలో నరేంద్రనాథుడి యొక్క దృక్పథంలో చాలా గొప్ప మార్పు వచ్చింది. భారతదేశపు జనసామాన్యంలో కలిసి పోవడానికి, ఎవరూ తనను గుర్తుపట్టాకుండా ఉండడానికి,స్వామి రకరకాలపెర్లు పెట్టుకుంటూ ఆయన అనేక ప్రాంతాలు పర్యటించారు.స్వామి తన యొక్క  పర్యటనలను చేస్తున్నటువంటి సమయంలో తాను ఒక భారతీయ సన్యాసిలాగా ఏకాంత జీవనం గడపాలనే సహజమైన కోరికను తను వదిలివేసి , తన ఒక్కడి సొంత ముక్తి కోసం వెంపర్లాడే మామూలు సాదారణ సాధువులా ఉండకూడదని కాదని ఆయన గ్రహించారు. స్వామి మదిలో భారతదేశము గురించి బాగా సంపూర్ణంగా తెలుసుకోవాలన్న ఒక బలమైన కోరిక ఒకవైపు రగులుతుండగా, మరొకవైపు అణగద్రొక్కబడిన భరతమాత మౌనరోదనల విన్నపాలు తన చుట్టూ పెల్లుబుకుతుండగా హిందువులకు పరమపవిత్రమైన వారణాసిని ముందుగా చేరుకొని ,స్వామి అక్కడ నుంచి లక్నో,ఆగ్రా,బృందావనం,హత్రాస్,రిషి కేశ్ లకు పర్యటించి తిరిగి కొంతకాలం తర్వాత స్వామి బారానగర్ కు వచ్చారు. హత్రాస్ లో తనకు ప్రథమ శిష్యుడైన స్వామి సదానందగా పేరు పొందిన శరత్చంద్ర గుప్తాను కలుసుకున్నారు . భారత దేశాన్ని, ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా పునరుజ్జీవింపజెయ్యాలనే బృహత్ పథకాన్ని తనకు తన గురుదేవులు అప్పగించినారని అతనికి తెలిపారు.

ఒక పరివ్రాజక సన్యాసిగా స్వామివారి యొక్క పర్యటనలని రోమారోలా ఇలా వర్ణించాడు:"ఇది ఒక మహాప్రస్థానం,ఒక గజ ఈతగాని లాగా ఆయన భారతదేశ మహా సాగరంలో దుమికారు,మహాసాగరం ఆయన కాలిబాటల్ని కప్పివేసింది,అలలలో తేలుతూ, అటూఇటూ కొట్టుకుపోతున్న జనసామాన్యం వేలమంది సన్న్యాసుల్లో తానూ ఒక కూడా అనామక సన్యాసిగా కలిసిపోయారు, కానీ ప్రజ్వరిల్లుతున్న మేధస్సు ఆయన కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనపడేది. ఎంత మారువేషం వేసినా రాజు రాజే!".

స్వామీజీ ఎక్కడికి వెళ్ళినా, అక్కడి ప్రముఖ ప్రదేశాలు, వ్యక్తులు ఆయనను ఎక్కువగా ప్రభావితం చెయ్యలేదు. సామాన్య ప్రజానీకపు దుర్భరదారిద్ర్యం, బాధలు ఆయన యొక్క హృదయాన్ని కలచివేశాయి. ఇంచుమించుగా మూడేళ్ళపాటు, తరచుగా కాలినడకన తను ప్రయాణించి, స్వామీజీ భారతదేశాన్ని తనకు తానుగా చూసి తెలుసుకున్నారు. అప్పుడు ఆయన ఒక విధంగా చెప్పాలంటే స్వామి తన ప్రయాణపు ముగింపుకు చేరుకున్నారు. గొప్ప ఉద్వేగంతో ఆయన కన్యాకుమారిలో కుమారీ దేవి విగ్రహం ముందు సాగిలపడి ఆ తర్వాత సముద్రం ఈది,దక్షిణ తీరంలో కొద్దిదూరంలో నీటిమధ్యవున్న ఒక కొండరాయిని చేరుకుని అక్కడ ఆరాత్రంతా తను తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయారు, ప్రయాణాలలో పొందినట్టి అనుభూతులన్నీ ఒక సుదీర్ఘచిత్రంగా ఆయన మనోనేత్రం ముందు కదలాడగా, భరతమాత యొక్క భూత,భవిష్యత్,వర్తమాన విషయాల గురించి ఆమె అథ:పతనానికిగల కారణాలు గురించి, తిరిగి ఉద్ధరించేందుకు తిరిగి చేయ వలసిన తగిన పద్ధతుల గురించి ఆయన ధ్యానం చేశారు. భారతదేశ పేదప్రజానీకానికి కావలసిన సహాయాన్ని కోరడానికి, తద్వారా తన జీవితపు మహాత్కార్యానికి ఒక రూపు నివ్వడానికి,పాశ్చాత్యదేశాలు ప్రయాణించాలి అనే అతి ముఖ్యమైన నిర్ణయాన్ని ఆయన ఇక్కడే తీసుకున్నారు.

ఈ నిర్ణయంతో ఆయన రామేశ్వరం,మధురైలకు ప్రయాణమయ్యారు. అక్కడనుంచి ఆయన మద్రాసు వెళ్ళారు. అక్కడ అలసింగ పెరుమాళ్ నాయకత్వంలో ఒక యువబృందం ఆయన అమెరికా వెళ్ళి అక్కడ చికాగోలో జరుగుతున్న సర్వమత మహాసభలో పాల్గొనాలన్న కోరికను బయట పెట్టారు. ఆ యువశిష్యులు ఆయన ప్రయాణ ఖర్చులకు అవసరమైన సొమ్ములను పోగు చేశారు. కానీ ఆ జగన్నాత తన ప్రయాణానికి ఇచ్చగించిందో లేదో తెలియదన్న నెపంతో స్వామీజీ ఆధనాన్ని పేదలకు పంచిపెట్టమని చెప్పారు. ఈ తరుణంలో స్వామీజీకి తన మనసులొ మాట సరైనదేనన్న దానికి ఒక సంకేతంగా కలలో శ్రీరామకృష్ణులు సముద్రం మీదకు నడుస్తూ తనను కూడా రమ్మని సంజ్ఞ చేస్తున్నట్టు ఆయనకు కనిపించింది. దీనికి తోడు శ్రీశారదాదేవి కూడా తన దీవెనలను, అంగీకారాన్ని తెలిపారు. శ్రీ శారదాదేవి కూడా ఒక కలలో శ్రీరామకృష్ణుల అంగీకారాన్ని పొందారు. దీనితో ఇక స్వామీజీ సందేహాలన్నీ తీరిపోయాయి.

ఖేత్రీమహారాజుకు కొడుకు పుట్టిన వేడుకలకు రావలసిందిగా ఆయనకి ఆహ్వానం అందింది. స్వామీజీ తన శిష్యుడి నుంచి అందిన అట్టి ఆహ్వానాన్ని కాదనలేకపోయారు.మాహారాజు స్వామీజీని సాదరంగా ఆహ్వానించి ఆయన ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లనూ చేయిస్తానని మాటయిచ్చారు. ఇక్కడే,స్వామి మహారాజుగారి విన్నపం మేర "వివేకానంద" అన్న పేరును పెట్టుకున్నారు. తాను మాట ఇచ్చినట్టుగానే మహారాజుగారు తన వ్యక్తిగత కార్యదర్శిని స్వామితో పాటు పంపి,స్వామికి బొంబాయినుండి ప్రయాణానికి కావలసినట్టి అన్ని ఏర్పాట్లను చేయించారు. అమెరికాకు స్వామీజీ 1893 మే 31 వ తేదీన వెళ్లారు.

స్వామి వివేకానందులు చైనా,జపాన్,కెనడాల మీదుగా ప్రయాణించి చికాగో నగరానికి జులై మధ్యభాగంలో చేరుకున్నారు. కాంటన్ లో ఆయన కొన్ని బౌద్ధవిహారాలను దర్శించారు. విశ్వమత మహాసభలో తగిన ఆహ్వానపు పరిచయపత్రాలు లేనిదే ఎవ్వరినీ అందులో పాల్గొనడానికి అనుమతించరనీ తెలుసుకుని నిరాశ చెందారు.దారి తప్పిపోయినట్టు తనకు తోచినా దేవుడిమీద భారంవేసి చికాగోకన్నా చౌకగా ఉండే బోస్టన్ నగరానికి వెళ్ళారు. తాను ప్రయాణించే రైలులో ఆయనకు మిస్ కాథరిన్ సాన్ బర్న్ తో పరిచయమయింది. ఆమె తన అతిథిగా ఉండమని స్వామీజీని ఆహ్వానించింది. ఆమె ద్వారా స్వామీజీకి హార్ వార్డ్ విశ్వవిద్యాలయ ఆచార్యుడైన జాన్ హెన్రీ రైట్ మహాశయునితో పరిచయం కలిగింది. సర్వమత మహాసభ అధ్యక్షునికి స్వామీజీని గురించి ఒక పరిచయపత్రాన్ని డా.రైట్ ఇచ్చారు. అందులో ఒక వాక్యంగా, "విద్యాధికులైన మన ఆచార్యులందరినీ ఏకం చేసిన దానికన్నా ఎక్కువ జ్ఞానవంతుడైన మనిషి ఇక్కడ ఉన్నాడు", అని వ్రాశాడు.

సర్వమత మహాసభ జరిగేనాటికి ఒకటి లేదా రెండురోజుల ముందు స్వామీజీ చికాగోకు తిరిగి వచ్చారు. కానీ ఆయన దిగులుకుతోడు ప్రాచ్యమత ప్రతినిధులకు ఆతిధ్యాన్ని అంద జేసే కమిటీ చిరునామాను పోగొట్టుకున్నారు. ఆ రాత్రి అక్కడి రైల్వేస్టేషన్లో తల దాచుకుని, మరునాటి ఉదయం తనకి ఎవ్వరైనా చిన్న సహాయం చెయ్యగల మనిషి కొరకు చూశారు కానీ శ్వేతజాతీయులుకాని వారికి సహాయం అంతత్వరగా లభించదు. స్వామి నిష్పలంగా చాలాసేపు అన్వేషించిన మీదట అలసిపోయి అంతా దైవసంకల్పంమీద వదిలి రొడ్డుప్రక్కన చతికిలబడ్డారు.అకస్మాత్తుగా ఆయనకు తన ఎదురుగా ఉన్న ఇంటిలోంచి ఒక స్త్రీ ఆయన వద్దకు నడిచి వచ్చి ఆయనకు ఏ సహాయం కావాలని అడిగారు. ఆమెయే శ్రీమతి జార్జ్ డబ్ల్యూ హేల్. వారింటి చిరునామాయే ఇక అమెరికాలో స్వామీజీ శాశ్వత చిరునామాగా నిలిచిపోయింది. హేల్ కుటుంబీకులందరును స్వామీజీ భక్తులైనారు.

సర్వమత మహాసభ 1893 సెప్టెంబరు 11 వ తేదీన ప్రారంభమయింది. కళాసంస్థ (Art Institute) సభాప్రాంగణం సుమారు 7000 మంది జనంతో కిటకిటలాడిపోయింది. వారు ఆదేశపు ఉత్కృష్ట సంస్కృతికి ప్రతినిధులు. వేదికమీద ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన అన్నిమతాల ప్రతినిధులు అందరు ఆశీనులయ్యారు. స్వామీజీ అటువంటి బ్రహ్మాండమయిన, విశ్వవిఖ్యాతులయిన వారితో నిండిన సభను ఉద్దేశించి ఎన్నడూ ప్రసంగించలేదు. ఆయన చాలా భయపడ్డారు. ఆయన తరుణం వచ్చినప్పుడు, మనస్సులో సరస్వతీదేవికి నమస్కరించి,
"అమెరికాదేశపు సోదర సోదరీమణూలారా!" అని సంబోధించారు, వెను వెంటనే ఆనాటి బ్రహ్మాండమైన సభలో కరతాళధ్వనులు మిన్నుముట్టాయి.పూర్తిగా రెండు నిముషాలు పాటు ఆ కరతాళాలు ఆగలేదు. ఏడువేల మంది జనం లేచి నిలబడి, తమకు అంతు బట్టనిదేదో ఒకదానికి నివాళులర్పించారు. ప్రజ్వరిల్లే చిత్తశుద్ధితో స్వామి పలికినటువంటి పలుకులు, తేజస్సుతో నిండిన ఆయన ముఖవర్చస్సు, కాషాయవస్త్రాలు వారిని ఎంతగా ఆకట్టుకున్నాయంటే మరుసటిరోజు వార్తాపత్రికలు స్వామీజీని సర్వమత మహా సభలో పాల్గొన్న ప్రతినిధులలో ఒకఅత్యంత అత్యుత్తముడిగా కీర్తించాయి.

వివేకానంద గొప్ప ఉపన్యాసకులు, ఆయన ప్రసంగం ఎంతటివారినైన అలరించేది.1893 సెప్టెంబరులో అమెరికాలో చికాగోలో జరిగిన మహాసభల్లో అయన చేసినటువంటి ప్రసంగం నేటికి ప్రపంచ దేశాలలో ప్రతి ధ్వనిస్తుంది. ఈ సభలో హిందూ వేదాంత భేరిని మ్రోగించిన స్వామి వివేకానంద ఇలా చెప్పారు ఎన్నటికైన విశ్వమానవ మతమనేది ఒకటి వెలసినది అంటే, అది తాను ప్రకటించిన భగవంతునిలా దేశకాలాతీతమై,అనంతమై ఉండాలి,కృష్ణుని అనుసరించే వారిమీద,సాధుపురుషుల మీద, పాపాత్ముల మీద అందరిమీద తదీయ భాను దీప్తి ప్రసరించాలి,అది బ్రాహ్మణమతంగా కాని మహమ్మదీయమతంగా కాని ఉండకుండా వీటన్నింటిని తనలో ఇముడ్చుకొని ఇంకా వికాసం పొందటానికి అనంతమైన అవకాశం కలిగియుండాలి.

ఆయన 1896 డిసెంబరు వరకూ పాశ్చాత్య దేశాలలో ఉన్నారు. ఆ కాలమంతా స్వామికి విపరీతమైన పని వత్తిడితో గడిచింది.ఇంక లెక్కలేనన్ని ఉపన్యాసాలు, తరగతులను నిర్వహించడంతోపాటు అయన ఆనాడు న్యూయార్కులాంటి నగరంలో ఒక వేదాంత సమాజాన్ని స్థాపించారు. సహస్రద్వీపవనంలో ఆయన కొద్దిమంది శిష్యులకి తనే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అక్కడ కొందరిని శిష్యులుగా చేసుకున్నారు. వారిలో ముఖ్యులు కెప్టెన్ సేవియర్ దంపతులు,సోదరి నివేదిత ఇంకా ఇ.టి.స్టర్డీ మొదలైనవారు. అంతకు ముందు జె.జె.గుడ్విన్ అనే సంక్షిప్త లేఖకుడు స్వామికి శిష్యుడయ్యాడు. ఈ పర్యటనలోనే ఆయన మాక్స్ ముల్లర్ కలుసుకున్నారు. ఆయన యూరపుఖండాన్ని పర్యటిస్తున్నప్పుడు నాటి ప్రఖ్యాతజర్మన్ ప్రాచ్యతత్త్వవేత్త అయిన పాల్ డుస్సెన్ ను కలుసుకునారు.

వివేకానంద స్వామి సేవియర్ దంపతులతో కలిసి 1896 డిసెంబర్ 16 తేదీన లండన్ నగరాన్ని వదలి బయలుదేరారు. ఇటలీలోని రోమ్ తదితరప్రదేశాలని సందర్శించిన స్వామి తరువాత డిసెంబరు 30తేదీన నేపుల్స్ లో భారతదేశానికి వెళ్ళే ఓడను ఎక్కారు.ఇంక నేపుల్స్ లో జె.జె.గుడ్విన్ వారితో కలిశాడు. స్వామి వారు 1897 జనవరి 15 న కొలంబో చేరుకునారు. స్వామీజీ వస్తున్నారన్న వార్త అప్పుడే భారతదేశమంతా పాకిపోయింది. దేశమంతటా అన్నిచోట్లా ప్రజలు స్వామీజీని ఆహ్వానించాలని ఎంతో ఆతృతతో ఎదురు చూడసాగారు.

ఆయన ఇప్పుడు మాములు "అనామక సన్యాసి" ఎంతమాత్రం కాదు. ప్రతి చిన్నాపెద్దా పట్టణంలో ఆయనకి ఆహ్వానం పలకడానికి ఆహ్వానసంఘాలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి.దానిని రోమారోలా ఇలా వర్ణించాడు ఇలా: "అత్యుత్సాహంతో ఎదురు తెన్నులు చూస్తున్న జనబాహుళ్యానికి తన భాతరదేశానికి గొప్ప సందేశంతో రాముడు, కృష్ణుడు, శివుడు పుట్టినట్టి భరతభూమిని పునరుజ్జీవింపజేసే శంఖారావంతో, జనుల ధీరశక్తినీ, అమర ఆత్మశక్తినీ గొంతు ఎలుగెత్తి పిలుస్తూ, యుద్ధరంగానికి కదను త్రొక్కమన్న ఆయన ఒక సేనాధిపతి. తన ’ఉద్యమ ప్రణాలికను’ వివరించి తన దేశప్రజలందరిని ముకుమ్మడిగా లేచిరమ్మని పిలుస్తూ, ’ఓ, నా భారత దేశమా! నీ ప్రాణశక్తి ఎక్కడుందో తెలుసా? మరణ మెరుగని నీ ’ఆత్మ’లోనే!" అని ఉద్భోధించారు. మద్రాసులో ఆయన ఐదు ఉపన్యాసాలను ఇచ్చారు. మానవుల బలహీనతలనూ, పిచ్చినమ్మకాలనూ ఇకనైన పారద్రోలి ఒక కొత్త భారతాన్ని నిర్మించమని బోధించే తూర్యనాదాలు అవి. " ఏ దేశ జాతీయజీవన సంగీతానికంతటికీ మతమే జీవస్వరమని" ఆయన బోధించారు. ఆ మతం, ’ఈ విశ్వమంతా ఆ ఆత్మస్వరూపమే’ అని బోధిస్తున్నదనీ, ఆ మతాన్ని బలోపేతం చేస్తే, మిగిలినవన్నీ వాటికవే చక్కబడునని బోధించారు. అయితే స్వామి తన దేశప్రజల బలహీనతలను ఆయన విమర్శించకుండా ఉండలేదు. దేశప్రజలు గుడ్డిగా పాశ్చాత్య పద్ధతులను అనుకరించడాన్ని, పాతకాలపు పిచ్చిపిచ్చి నమ్మకాలని, కుల విభేదాలను ఆయన తూర్పారబట్టారు.

స్వామి వివేకానంద 1897 లో స్వదేశానికి తిరిగి వచ్చినారు. దీనితో భారతదేశంలో ఒక నూతన శకం ప్రారంభమైనది. వెనువెంటనే స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ కూడా స్థాపించారు.వివేకానందుడు ఒక గొప్ప దేశ భక్తుడు.స్వామి భారతదేశ ఘనతను వర్ణిస్తూ ఇక్కడనే ఈ ఒక్క భారతదేశంలోనే మానవ హృదయం అతి విశాలమై అనంత విస్తృతిని పొంది తోటి మానవ జాతినే కాక అనేకమైన పశుపక్ష్యాదులతో సహా సమస్త ప్రాణికోటిచేత సర్వజగత్తు ఉచ్చంనీచం లేకుండా తనతోనే వున్నట్లు భావన చెయగలిగింది అన్నారు. మనలోని లోపాలు వివరిస్తూ "మనంతట మనం పని చేయం, పనిచేసే వారిని పనిని చేయనీయం . వారిని విమర్శించి తప్పులెంచి అవహేళన చేస్తాం. మానవ జాతిపతనానికి ముఖ్యమైనదీ ఇట్టి లక్షణమే" అన్నారు. దైవ విశ్వాసం కంటె మానవ విశ్వాసం ముఖ్యమని బోధిస్తూ "మూడు వందల ముప్పైకోట్ల మంది దేవతలలోనూ నమ్మకమున్నా నీలో నీకే ఎట్టి విశ్వాసం లేకపోతే నీకు ముక్తి లేదు. మనదేశ ప్రజలందరికి ఆత్మవిశ్వాసం మరియు క్రియా శూరత్వము కావాలి. ఈ అవసరము నాకు కనిపిస్తుంది "అని నొక్కి చెప్పారు. అంతేకాక "మనం సోమరులము, ఏ పని చేయలేము ముందు మనమంతా సోమరితనాన్ని వదిలి కష్టించి పనిచెయటం అలవర్చుకోవాలి, ఇక అప్పుడే దేశం బాగుపడుతుంది" అంటూ యువతరాన్ని ప్రేరేపించిన మహాశక్తి, గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద.

"నా దేశంలో కుక్క పస్తుపడి ఉన్నదానికి ఆహారం పెట్టి రక్షించటమే నా పరమధర్మం. ఇదే నా మతం. తద్భిన్నమంతా ఆదర్శమే, కృత్రిమ ధర్మమే" అని నిరుపేదయైన నా భారత నారాయణుని , నా యిష్టదేవతలను అర్చించటానికై ఎన్ని జన్మలైనా ఎత్తగలను, ఎన్నిబాధలైన ఓరుస్తాను అని ప్రకటించినారు, అన్నదాన, విద్యాదాన, జ్ఞానదానాలచే భారత ప్రజలసేవ చేస్తూ యావద్భారతంలో కాకుండా ప్రపంచమంతటా ప్రఖ్యాతి వహించిన తన గురువు శ్రీరామకృష్ణ పేరమఠసేవా సంస్థలను స్థాపించిన ఘనత ఒక్క స్వామి వివేకానందకే దక్కుతుంది.
వివేకానందుల వారి కొన్ని అమృత వాక్కులు నిత్యసత్యములు మనం గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు: ప్రతి జీవి పరాత్పరుడే. ఈ లోకంలో సత్సాంగత్యము కంటే పవిత్రమైనది మరి ఒకటి లేదు. స్వార్ధ చింతన లేనప్పుడే మనం గొప్ప ఘనకార్యములు సాధిస్తాం.మన ప్రభావం ఇతరులపై పడుతుంది.ఇంక మన మతమంతా (ధర్మ) మనలోనే ఉంది. మన గ్రంధాలు గాని, గురువులు గాని, దాన్ని కనుగొనటానికి సహాయపడటం కన్నా ఏమీ చేయలేరు. వారు లేకపోయినా మనలోనే సత్యాన్ని దర్శించగలం. మతం ఒక ధర్మం వంటిది. భక్తిమార్గం చాలా సంతోషదాయకం. ప్రతివ్యక్తి మహోన్నతమైన ఆదర్శం ఎన్నుకుని తన జీవితాన్ని మలుచుకోవాలి.

స్వామిజీకి దగ్గరపడుతున్న తన అంత్యకాలం మరింత స్పష్టంగా కనపడసాగింది. ఆయన మిస్ మాక్లౌడ్ కు ఒక లేఖలో ఇలా వ్రాశారు: "ఆ ప్రశాంతతీరానికి నా నావ చేరుతున్నది. అక్కడ నుంచీ మళ్ళీ అది బయలుదేరదు!".
బేలూరుకు తిరిగివచ్చి కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. స్వామి తర్వాత బెంగాలు మరియు అస్సాంకు ప్రయాణమయ్యారు. ఆయా చోట్ల ఉన్న తీర్థప్రదేశాలని దర్శించాలని స్వామీజీని తన తల్లి భువనేశ్వరీదేవి కోరారు. ఈ మాట స్వామీజీ మిసెస్ బుల్ కు వ్రాసిన ఉత్తరంలో ఈ విధముగా వ్రాసియున్నారు "ప్రతి హిందూ వితంతువుకూ ఉండే కోరిక ఇది , నా వారికి నేనన్ని విధాలా బాధల్నే తెచ్చిపెట్టాను. ఆమె [అమ్మకు యున్న]ఈ ఒక్క కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తున్నాను." నంగల్ బంధ్, కామాఖ్య, షిల్లాంగ్ లాంటి మొదలైన ముఖ్య ప్రదేశాలను సందర్శించి, ఇక ఢాకాలోనూ, షిల్లాంగ్ లోనూ కొన్ని ఉపన్యాసాలిచ్చిన తర్వాత స్వామీజీ బేలూరు మఠానికి తిరిగి వచ్చారు.స్వామీజీ  అంతవరకూ తన పేరుమీదున్న బేలూరుమఠ ఆస్తులన్నింటినీ తన సోదర సన్న్యాసుల పేర బదిలీ చేసి తన వ్యవహార బాధ్యతలన్నియు పూర్తిగా తొలగించుకున్నారు.

తన అంత్యకాలం సమీపించిందని స్వామీజీకి తెలుసు. 1902 లో జులై 4 వ తేదీన ఆయన ఉదయం కొంతసేపు ధ్యానం చేశారు. ఆ రోజు మధ్యాహ్నం ప్రేమానందస్వామితో కలిసి వాహ్యాళిగా నడిచి, సాయంత్రం తన గదిలో ఒక గంటసేపు ధ్యానం చేశారు. కొంతసేపు విశ్రాంతిగా పడుకున్నారు. ఆతర్వాత స్వామి కొంతసేపటికి రెండుసారులు నిండుగా తన శ్వాసతీసుకుని మహాసమాధిలోకి ప్రవేశించారు  స్వామి.

స్వామి తన భౌతిక శరీరాన్ని త్యజించి ఉండ వచ్చునుగాక,కానీ ఆయన శ్రీ ఎరిక్ హామ్మండ్ గారితో లండన్ లో చెప్పినట్టి మాటలు చూస్తే స్వామి నేటికి అమరుడనే మాట మాత్రం ఒక సైద్ధాంతిక వాస్తవం, స్వామి చెప్పిన మాటలు " నా శరీరాన్ని ఒక చింకి పాతలాగా విసిరేసి బయటికి పోవడమే మంచిదని నాకు [అంటే స్వామికి] అనిపిస్తూ ఉండవచ్చు గాక ! కానీ నేను పనిచెయ్యడం మానను!తానే దైవాన్నని నేటి ఈ ప్రపంచం తెలుసుకునేంతవరకూ ప్రతి ఒక్కరికీ నేను ప్రేరణను కలిగిస్తూనే ఉంటాను"

నేడు జయంతి సందర్భముగా... 

Written by Mallareddy DesiReddy

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp