దివి సీమ ఉప్పెన

By Siva Racharla Nov. 19, 2019, 06:24 pm IST
దివి సీమ ఉప్పెన

క్రిష్ణా నది రెండు పాయల మధ్య ఏర్పడ్డ అందమైన దివి సీమ బౌధ్ద స్థూపం ఉన్న ఘంటశాల,శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద రచించిన ఆదిమహావిష్ణువు ఆలయం ఉన్న శీకాకుళం,చల్లపల్లి జమీన్ .. క్రీస్తు పూర్వం నుంచి 19వ శతాబ్దం వరకు చరిత్ర ఆనవాళ్లు ఉన్న ప్రాంతం. దివిసీమకు అవనిగడ్డ కేంద్రంలాంటిది.దివి సీమ లంక గ్రామాల మధ్య తెప్పలు మీద ప్రయాణం. చేపల వేట,కూరగాయల సాగు సినిమాల్లో చూపించే అందమైన గ్రామీణ జీవనం దివి సీమలో వాస్తంగా కనిపిస్తుంది... హంసలదీవి వద్ద కృష్ణా నది సముద్రంలో కలుస్తుంది. కృష్ణా నది చిన్న చీలికలు ఎదురుమొండి వద్ద సముద్రంలో కలుస్తాయి.అవనిగడ్డ నుంచి కాలువ గట్టు లాంటి రోడ్డు మీద హంసలు దీవి ప్రయాణం బాగుంటుంది. మార్గ మధ్యలో కాలువను దాటటానికి అనేక చిన్న అడ్డ వంతెనలు ఉన్నాయి.

ప్రకృతి ప్రశాంతంగా ఉంటే దివిసీమ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు. ఏమాత్రం ఈదురు గాలులు మొదలయినా తుఫాను వస్తుందేమోనన్న భయం వారికి నిద్రపట్టనియ్యదు.55-60 సంవత్సరాలు నిండిన పెద్దలు తరచుగా చెప్పే దివిసీమ ఉప్పెన విషాద కథలు వారిని వెంటాడుతాయి.

42 సంవత్సరాల కిందట 19-Nov-1977 మధ్యాహ్నం మొదలైన వాన ,తుఫానై , ఉప్పెనై  దివిసీమను ఊడ్చిపెట్టింది.ముందు రోజు రాత్రి నుండి తుఫాను హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. శనివారం నుంచి మూడు రోజులు స్కూళ్ళను మూసి వేస్తున్నట్లు కృష్ణా కలెక్టర్ అధికారికంగా ప్రకటించాడు. ఉదయం నుండి తీవ్రమైన మబ్బులు కమ్ముకొని , గంటకు 130-140 కి.మీ కంటే వేగంతో గాలులు మొదలయ్యాయి. రాత్రి పది దాటిన తర్వాత తుఫాను భీభత్సం పెరిగింది. మిన్నూ మన్నూ ఏకమయ్యేట్లు భీభత్సంగా వర్షం కురిసింది. అర్ధరాత్రి పూట కట్టలు తెంచుకున్న ప్రవాహం గ్రామాలను ముంచెత్తింది.

చీకట్లో వరదలో అనేకమంది కొట్టుకుపోయారు,కొన్ని శవాలు చెట్లకు తగులుకుని ఆగాయి.పశుపక్ష్యాదులు సైతం మృత్యువాతపడ్డాయి. 140 కిలోమీటర్ల వేగంతో వీసిన గాలులకు భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు ఒరిగిపోయాయి. గ్రామాలను శ్మశానంగా మార్చింది. శవాల గుట్టల మధ్య అయినవారి ఆనవాళ్లను వెతికేందుకు కొన్ని రోజుల సమయం పట్టింది.ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 14,204 మంది చనిపోయారు. 150 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. వరద నీరు చాలా రోజుల పాటు ఉండటంతో శవాలను కాల్చటానికి కూడా వీలు లేని పరిస్థితి.మరోవైపు కలరా వ్యాపిస్తుందేమోనన్న భయం,ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో ప్రజలు చూశారు.శవాలు కాల్చటానికి కర్ర మండదు ... చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కిరోసిన్ తీసుకొని ప్రజలు స్వచ్చందంగా వెళ్లారు.

పాలకాయతిప్ప, హంసలదీవి, గొల్లపాలెం, బసవవానిపాలెం, ఉల్లిపాలెం, ఏటిమోగ, సొర్లగొంది, ఎదురుమొండి, సంగమేశ్వరం, నాచుగుంట, ఏలిచట్ల దిబ్బ తదితర మత్స్యకార గ్రామాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణాతోపాటు గుంటూరు జిల్లాలోనూ ఈ ఉప్పెన ప్రభావం కనిపించింది. రేపల్లె, నిజాంపట్నం తదితర గ్రామాలు ప్రళయం దాటికి దెబ్బతిన్నాయి.

దివి సీమ ఉప్పెన తరువాత ప్రభుత్వం తుపాను షెల్టర్లు కట్టింది. పరిస్థితి చాలా వరకు మెరుగు పడింది కాని తీసుకోవలసిన రక్షణ చర్యలు ఇంకా చాలా ఉన్నాయి. ద్రవం ఉన్న చోట ఉపద్రవం తప్పదు ,ఉప్పు ఉన్న చోట ఉప్పెన తప్పదు అంటాడు ఒక కవి..ఉపద్రవం ఉందని తీరాన్ని వొదిలి ప్రజలందరు పట్టణాలకొచ్చే పరిస్థితి లేదు ,ప్రభుత్వమే ఎక్కువ రక్షణ చర్యలు తీసుకోవాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp