బాపు రవణల సంక్రాంతి...

By Guest Writer Jan. 15, 2020, 10:18 am IST
బాపు రవణల సంక్రాంతి...

‘ఈపాటికి రైలొచ్చేసే వుంటుంది. మీరింకా నీళ్ళూ పోసుకోలేదు, జపఁవూ కానివ్వలేదు. తొరగా లేచి తెమలండి!’

భార్య చదువుతున్న స్తవానికి చదువుతున్న పేపరు పక్కనబడేసి భుజాన తువ్వాలేసుకుని లేచాడు సీతారాఁవుడు. ఏడుగంటల బండికి దిగుతాన్నాడు లక్షినాణ...అదే...బాపు!

కాలవగట్టున నిలబడి చెంబుతో నీళ్ళుపోసుకోడం అలవాటు సీతారాఁవుడికి. చప్టాలు జారుతున్నాయి. చల్లటి నీళ్ళలో కొబ్బరాకుల నీడలు నిలకడగా, నిశ్శబ్దంగా కదులుతున్నాయి.

గోదారి కాలవగట్టునే ఇల్లు. పెరటిగుమ్మంలోంచి బయటకి రాగానే గలగల్లాడుతూ కనబడుతూ వుంటుంది. దూరంగా వేణుగోపాలస్వామి గుళ్ళోంచి గంటలు మృదువుగా వినబడుతున్నాయి.

స్నానం పూర్తయి వంటగదిలోకి రాగానే ఘుమఘుమలాడే లక్స్ సబ్బు వాసనకి తిరిగిచూసింది కనకరత్నం.

‘ఇడ్డెన్లు రెడీగా వున్నాయి. తినేసి వెడతారా లేక మీ స్నేహితుడొచ్చాక ఇద్దరూ కలిసే తింటారా?’ అంది కనకరత్నం ఇడ్లీవాయిమీంచి వాసిని తీస్తూ.

‘ఇంకానయం! వాణ్ణొదిలేసి తింటే పాపంకూడానూ! కలిసేతింటాం. కారప్పొడీ, నెయ్యీ సిద్ధంచెయ్యి! వాడికి చాలాయిష్టం!’ అంటూ లాల్చీ తొడుక్కుని బయల్దేరాడు.

బాపు....

అమ్మానాన్నా పెట్టిన పేరొదిలేసి ఆ రెండక్షరాలతోనూ చెలామణీ అయిపోతున్నాడు. ఈమధ్య అందరూ మరీ ముద్దుచేసేస్తున్నారు. ఏవో బొమ్మలేస్తాట్ట, నవ్వుతాలకి ఏవో గీస్తాట్ట, అమ్మాయిల బొమ్మలైతే మరీనుట!

ఎవరడిగారో మరి, స్నేహితుడు రవణతో కలిసి సినిమాల్లో దూరాడు. అక్కడంతా పైపూతల మెరుగులు, కోతలరాయుళ్ళకి పైకోతల పాపారాయుళ్ళూ వున్నా సరే మనవాడు మాత్రం గోదారీ, పడవా, పాపికొండలంటూ అక్కడక్కడే తిరుగాడుతూ తీసేశాట్ట సినిమాలన్నీ!

అంతాకలిసి ఓ ముద్దరేసి వదిలారు బాపురవణలమీద! ‘వీళ్ళిద్దరొరేయ్, సినిమా మొత్తం చవగ్గా లాగించేస్తారు. నీకాట్టే ఖర్చుండదు. కానీ వాళ్ళకి నచ్చిందే చూపిస్తారు తప్ప నువ్వడిగావని ఏదీ చూపించరు!’ ఇదీ ముద్ర!

ఆలోచనల్లో వుండగానే రైలొచ్చేసింది. పెట్లన్నీ తిరుగుతూ కంగారుగా వెతుక్కుంటోంటే వెనకనించి భుజమ్మీద చెయ్యిపడింది. తీరాచూస్తే నిండుగా నవ్వుతూ బాపు. గాలిపటానికి తోకలా పక్కనే రవణ! అదిలేకపోతే ఇదీలేదు!

బ్రహ్మకోసం తపస్సుచేస్తే విష్ణుమూర్తి కూడా వచ్చాట్ట! అలావుంది సీతారాఁవుడి పరిస్థితి. కళ్ళనిండా నీళ్ళతో ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు బాల్యమిత్రుణ్ణి. అంత ఆత్మీయంగానూ అక్కునచేరాడు బాపు.

రిక్షా కట్టించుకున్నారు ముగ్గురూ. ఎన్నాళ్ళయిందిలా కలిసితిరిగి? దారిపొడవునా బోల్డుకబుర్లు. చిన్నతనంలో కలిసి ఆడుకున్న చెట్టునీడల్ని చూస్తూ ఉద్వేగపడిపోతున్నారు.

‘ఒరేయ్, నీగ్గుర్తుందా? ఓసారి భోగిమంటకి కర్రల కోసం తెల్లారగట్ట మూడింటికి వీర్రాజుగారి దొడ్లో దూరాం? కొట్టుగది తలుపు ఊడొచ్చేసేలా...’

ఇంకా పూర్తిగా చెప్పనివ్వకుండానే రవణందుకున్నాడు...

‘అదికాదురా, పాపం బానేవుండేది ఆతలుపు. వాళ్ళ మేనల్లుడు ధనంగాడే బొందులన్నీ ముందురోజు ఊడబీకేశాట్ట! ఆతరవాత తెలిసిందది! మేఁవేమో ఆ తలుపు ఊడదీసి పట్టుకుని వెనక్కితిరిగి చూసేటప్పటికి వాళ్ళ టైగర్ ఎదురుగ్గా నిలబడుంది. నమ్మవుగానొరేయ్, లాగూలు తడిసిపోయాయి ఒక్కొక్కడికీ! ఏంచెయ్యాలో తెలీలా! అది కరవదూ, అరవదూ! ‘ఊఁ!’ అంటూ ఆపకండా గుర్రు! ఒక్కడుగు ముందుకేసినా పిక్కలు పీకిపడేస్తుంది. అందులోనూ లాగులేసాం అందరఁవూనూ!

ఈలోగా వీర్రాజుగారు చుట్టకాల్చుకుంటూ వచ్చి ‘టైగా...ర్!’ అనడంతో ఆయనెనకాలకి వెళ్ళి నిలబడింది!’

ఏమాత్రం భేషజం లేకుండా కబుర్లు చెబుతున్న మిత్రద్వయాన్ని చూస్తోంటే గర్వంగాను, ఆనందంగాను లోపల్లోపల ఉద్వేగపడిపోతున్నాడు సీతారాఁవుడు.

‘ఏఁవయ్యిందా తరవాత?’ అన్నాడు రిక్షా కుదుపులకి వాళ్ళిద్దరి మోకాళ్ళూ పట్టుకుంటూ! ఇద్దర్నీ సీట్లో కూచోబెట్టి కింద మఠఁవేసుక్కూచున్నాడు హనుమంతుళ్ళా! ఎంత వారించినా వినలా!

రవణ మళ్ళీ మొదలెట్టాడు ...

‘వీర్రాజుగారు కాసేపు అలాచూసి, ‘పట్టుకుపోండ్రా!’ అనేసాడు. మాకర్ధంకాలా! ఒకవేళ ‘మేఁవిలా బయల్దేరగానే వెనకాలే టైగర్ని వదుల్తాడా ఏఁవిటి వెధవఖర్మ?’ అనుకుంటూ పిల్లుల్లా బయటికొచ్చాం.

ఆనక మానాన్న గుళ్ళో కనబడి క్షమించమని అడిగితే అన్నాట్ట.. ‘ఇది పిల్లలపండగ పంతులూ! వెధవ తలుపుదేఁవుందయ్యా! సాయంత్రానికల్లా కొమ్మోజోళ్ళ అల్లుణ్ణి పిలిచి ఇంకోటి చేయించేస్తాను. భోగిపండగ మళ్ళీ ఏడాద్దాకా రాదుగదా? మంట పైకిలేవకపోతే పిల్లల మొహాలు వెలగవయ్యా! డీలాపడిపోతారు. నువ్వు మర్చిపోయావేమో, చిన్నప్పుడు మనం ఎన్ని నులకమంచాలు ఎత్తుకొచ్చెయ్యలేదూ?’

అంతపెద్ద నవాబూ అలా మాటాడుతోంటే నాన్నకి కళ్ళమ్మట నీళ్ళొచ్చేసాయిట! ‘మనిషిని చూస్తే వెన్నుపూస వణికిపోతుందిగానీ మనసు వెన్నపూసేన్రా!’ అనేవాడు మానాన్న!’

జ్ఞాపకాల బొట్టుపెట్లని ఒకటొకటిగా తెరుస్తున్నాడు రవణ!

‘నిజఁవేరా! ఎంత సంపాయించినా నీతోకలిసి ఇలా కబుర్లుచెప్పుకుంటూ ఊరంతా ఊరేగుతోంటే వచ్చిన ఆనందం ముందు దిగదుడుపేరా!’ అన్నాడు బాపు.

ఆమాటకి అప్రయత్నంగా స్నేహితుడి రెండుచేతులూ పట్టేసుకుని ఉద్విగ్నతకి లోనయ్యాడు సీతారాఁవుడు.

ముగ్గురూ మధ్యదారిలో రిక్షా ఆపించి వీరన్న కాఫీకొట్లో దూరారు.

తడికమీద మనవూరి పాండవులు పోస్టర్ అంటించుంది. ఆ పక్కన అందాలరాముడు, స్నేహం! సీతారాముడన్నాడు.. వీరన్నకి గర్వంట! నాకొట్లో కాఫీల్తాగడంవల్లే ఆళ్ళిద్దరికీ అన్ని తెలివితేటలంటాట్ట!

పెద్దవాడైపోయాడన్నమాటే తప్ప ధాటీ ఏఁవీ తగ్గలా వీరన్నకి. ‘ఏంకావాలండే?’ అని ఒక్కరుపు అరిచాడు గట్టిగా! డెబ్భయ్యేడేళ్ళ స్వరంకాదది!

‘అంటే మర్చిపోయావన్నమాటే! వీడితో నేనంటూనే వున్నాను. ‘వీరన్న గుర్తుపడితే చాల్రా! ఇంక ఊరంతా గుర్తుపట్టేసినట్టే!’ అని!’ అని బాపు అన్నాడోలేదో

‘మీరా బాబులూ? మళ్ళీ అరువెట్టడానికొచ్చారా? ఎన్నాళ్ళయ్యింది మీరంతా మాకొట్లో దూరి? రండ్రండి! ఒరేయ్, నాలుగు డబల్ ష్ట్రాంగ్ కాఫీలు చెయ్యమని చెప్పాడికీ!’ అని ఆర్డరేశాడు కుర్రాడికి.

‘నాలుగెవరికి వీరన్నా? నువు తాగవుగా?’ అన్నాడు బాపు ముసలాడి కళ్ళలోకి అనుమానంగా చూస్తూ!

‘తెలుసులేవోయ్! నీకు రెండుకాదేటి? నాకన్నీ గ్యాపకఁవే! అరువైనా సరే రెండుకాఫీలూ తాగే ఎల్లీవోడివి. నీకివ్వకుండా నాకూ మనసొప్పేదికాదు. ఆరోజంతా యాపారం డల్లైపోయేది. ఎన్ననుకున్నా తిరుమూర్తుల్లా మీరు ముగ్గురూ మాకొట్లో పెచ్చక్షం అయితేగానీ నాకు తోచీదికాదు!’ అన్నాడు పెద్ద గొంతేసుకుని!

సినిమా వూసులు, ఊరు విశేషాలు, కుటుంబం కబుర్లతో కమ్మటి కాఫీలు తాగారు ముగ్గురూ! మళ్ళీ ఊరెళ్ళేలోగా ‘ఇంకోపాలి’ వస్తాఁవని ఒట్టేసి మళ్ళీ బయల్దేరారు మిత్రత్రయం.

రేవుదగ్గరకి రాగానే బోటు కనబడింది. స్కూటర్లు, సైకిళ్ళు ఆల్రెడీ ఎక్కించేసారు. గంపలవాళ్ళు కిందకూర్చునున్నారు. బయల్దేరిపోతోందని అర్ధమై ఆగమంటూ అరిచి ఆపించాడు సీతారాఁవుడు.

ముగ్గురూ ఎక్కినవెంటనే బయల్దేరిపోయింది బోటు. గోదార్ని చీల్చుకుంటూ దూసుకెళుతోంటే విడిపోతున్న నీళ్ళని చూస్తున్నారు ముగ్గురూ!

‘తమసొమ్ము సోమవారం ఒంటిపొద్దులుంటారు
మందిసొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు’

పాటందుకున్నాడు సీతారాఁవుడు. మిత్రులిద్దరూ బల్లలమీద దరువెయ్యడం మొదలెట్టారు. పాటపాడాలంటే వాడితరవాతే! ఆవిషయం బాగా గుర్తుంది స్నేహితులిద్దరికీ! పాట పూర్తయిపోయాక వాళ్ళవైపు తిరిగి అన్నాడు

‘ఏం రాశాడ్రా ఈపాట! నిజంగా మీరిద్దరూ లేకపోతే మన తెలుగు‘ధనఁ’వంతా వృథాయే కదరా? దగ్గరుండి చెప్పి రాయించుకుంటార్టగా పాటలన్నీ? అందులో వేదాంతం చూడు? పెసరట్లో ఉప్మాలా ఎలా ఇమిడుందో?’

‘పాపం ఆకలేస్తున్నట్టుందిరా వీడికి? అందుకే పెసరట్లూ, ఉప్మాలు అంటున్నాడు!’ అంటూ ఆటపట్టించాడు రవణ. మనసారా నవ్వేసుకున్నారు. గోదారి గలగలల్లో ఆ కిలకిలలు కలిసిపోయాయి.

మాటల్లో వుండగానే రేవొచ్చేసింది. ‘నేను ముందంటే నేను ముంద’ని దెబ్బలాడేసుకుంటున్నారు ముగ్గురూ! చిన్నప్పటినుంచీ అంతే! ఒకడు చివరిదాకా వెళ్ళగానే మిగతా ఇద్దరూ పీతని లాగేసినట్టు లాగిపడెయ్యడం, ఆతరవాత మరొకణ్ణి.

చివరికి అంతా దిగిపోయేదాకా అల్లరిచేసి ముగ్గురూ దిగారు.

ఊరంతా పిడకలు కాల్చిన వాసన.

పెంకుటిళ్ళ వెనకాల పొగ్గొట్టాల్లోంచి సన్నగా పైకిలేస్తున్న పొగ.

కాలవగట్టుమీద బట్టలు జాడిస్తున్న శబ్దాలు.

అన్నిళ్ళముందూ పేడనీళ్ళ కళ్ళాపిజల్లి పెట్టిన తెల్లటిముగ్గులు.

ఇళ్ళముందు వెదురుబద్దల దడినానుకుని విరగబూసిన బంతిపూల చెట్లు.

పలకరిస్తున్నట్లు తలలూపుతూ స్వాగతం పలుకుతున్న అరచెయ్యంత చామంతులు.

ఈవూరు నాది. ఈ గాలీ, పూలూ, చెట్లూ నావి. ఈ మనుషులూ నావాళ్ళే! అనే ‘సొంత’భావం ముగ్గురి మనసుల్లోనూ మూగగా ముచ్చట్లాడుతోంది. మాటాడాలనిపించట్లేదు.

ఇల్లొచ్చేసింది. గుమ్మంలోనే అర్ధరూపాయంత బొట్టెట్టుకుని నేతచీర కట్టుకున్న లక్ష్మీదేవిలా ఎదురయింది కనకరత్నం.

‘బావున్నారా అన్నయ్యలూ? ఎన్నాళ్ళయిపోయింది కలిసి?’ అంది కాళ్ళుకడుక్కోడానికి నీళ్ళిస్తూ!

‘వీడేం మారలేదొరేయ్! అదే మడతమంచం, అవే గొబ్బిపూలు, అదే ముక్కాలిపీటానూ!’

అనుకున్నారు మిత్రులిద్దరూ. పావుగంట కబుర్ల తరవాత తువ్వాళ్ళు కట్టుకుని కాలవలో దిగారు. వాళ్ళతోపాటు వెళ్ళి గట్టున కూర్చున్నాడు సీతారాఁవుడు.

‘లాగేస్తానొరేయ్! దూరంగా కూచో! లేకపోతే ఇవాళ ఆంజనేయస్వామి గుడిగట్టుదాకా ఈదించేస్తాను నీచేత!’ అన్నాడు రవణ.

సీతారాఁవుడికి ఈతరాదు. చిన్నప్పటినుంచీ వున్న బెదిరింపే అది. ఇంకా మర్చిపోలేదు వాళ్ళిద్దరూ!

కాలవలో స్నానాలు చేస్తూ కేరింతలు కొడుతోంటే అమ్మవొళ్ళో ఆడుకుంటున్న పిల్లల్లా వున్నారు వాళ్ళిద్దరూ!

గోదారంటేనే అమ్మ!

ఇడ్లీలు చల్లారిపోతాయి, ఈతలు కానిచ్చి త్వరగా రమ్మని పనిమనిషి వెంకటమ్మచేత కబురంపింది కనకరత్నం. పోరగా పోరగా ఒడ్డునపడ్డారు ఇద్దరూ!

తువ్వాలుతో తుడుచుకోకూడదుట. అలా నీరెండలో నిలబడి, గాలికి ఆరిపోతేనే బావుంటుందిట! వీడివన్నీ చాలా వింత ఆలోచనలు. బొమ్మలూ అంతే! అందర్లాగా గియ్యడు. చూడగానే పోల్చేస్తాం. ఒక్క గీతలో అందాన్నంతా రంగరించి పోసేస్తాడు.

దేవుడికి దీపాలెట్టుకుని కూచున్నాక ఇడ్డెన్లు ఆవురావురుమనిపించారు ముగ్గురూ. వాళ్ళు వద్దనీ అనరు, కనకరత్నం తేకా మానదు. ఎన్నితిన్నా ఎక్కసం కాని పదార్ధఁవేదో కలుపుతుందనుకుంటా వాటిలో!

కొబ్బరిపచ్చడీ, కారప్పొడితో కలిపి తింటోంటే ఆ రుచికి మత్తొచ్చేస్తోంది. ఆబగా తినేస్తోంటే అడ్డంపడి పొలమారింది లక్షినాణకి. నెత్తిమీద తట్టి నీళ్ళు తాగించాడు సీతారాఁవుడు.

‘ఇంత రుచేంట్రా బాబూ! నీ అదృష్టఁవే అదృష్టంరా! అమృతహస్తం!’ అన్నాడు తేరుకున్న తరవాత.

‘అది తనచేతిలో లేదురా! మీ మనసుల్లో వుంది!’ అన్నాడు సంతోషంగా.

బుల్లెట్లలాంటి మాటల్రాసే రవణ బుద్ధిమంతుళ్ళా తలొంచుకు తినేస్తున్నాడు.

కబుర్లు చెప్పుకుంటూ నవ్వులతోనే సగం కడుపునింపేసుకుంటున్న ఆ ముగ్గుర్నీ చూస్తూ తన ఆకలిని మర్చిపోయింది కనకరత్నం.

వాళ్ళిద్దరూ స్నేహానికి నిర్వచనం!
వారిద్దరికీ అంకితం నా ఈ వచనం!

మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!

.........జగదీశ్ కొచ్చెర్లకోట

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp