iDreamPost

ప్రకాశం జిల్లాలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ.. మాతృభూమిపై ఎన్నారై మమకారం

ప్రకాశం జిల్లాలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ.. మాతృభూమిపై ఎన్నారై మమకారం

ప్రకాశం జిల్లా అంటే వెనుకబాటుతనానికి చిరునామాగా నిలుస్తుంది. రాష్ట్ర నడిబొడ్డున ఉన్నా వ్యవసాయ, పరిశ్రమ రంగాల్లో అత్యంత వెనుకబడి ఉంది. ఇలాంటి జిల్లా నుంచి ఉన్నత విద్యనభ్యసించి, సాంకేతిక రంగంలో రాణిస్తున్న వారు.. జిల్లా అభివృద్ధికి చొరవ చూపుతున్నారు. స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవది గ్రామానికి చెందిన భాస్కర్‌ రెడ్డి, ఆయన సోదరుడు అంజిరెడ్డిలు కలసి గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌ సమీపంలో కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు మూడు ఎకరాల్లో అధునాతనమైన భవనాన్ని నిర్మించారు.

టెక్‌బుల్స్‌..

సువిశాల భవనంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ఏర్పాటు చేసేందుకు భాస్కర్‌ రెడ్డి సోదరులు సిద్ధమయ్యారు. ఆ కంపెనీకి ఒంగోలు జాతి ఎడ్ల ప్రాశస్త్యాన్ని ప్రతిబింబించేలా టెక్ బుల్స్‌ అనే పేరు పెట్టారు. నిర్మాణం కూడా పూర్తికావడంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా కంపెనీని ప్రారంభింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కంపెనీ ద్వారా మూడువేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి ఏడాది 500 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భాస్కర్‌ రెడ్డి, అంజిరెడ్డి సోదరులు చెబుతున్నారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సొంత జిల్లాలో ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. స్టార్టప్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్న వారికి తమ టెక్‌బుల్స్‌ తోడ్పాటును అందించేందుకు భాస్కర్‌ రెడ్డి సోదరులు సిద్ధంగా ఉన్నారు. టెక్‌బుల్స్‌ ద్వారా రాబోయే రోజుల్లో రైతులకు మేలు జరిగే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు భాస్కర్‌ రెడ్డి, అంజిరెడ్డి సోదరులు ప్రణాళికలు రచిస్తున్నారు.

25 ఏళ్లుగా ఐటీ రంగంలో..

భాస్కర్‌ రెడ్డి, అంజిరెడ్డి సోదరులు 25 ఏళ్లుగా ఐటీ రంగంలో ఉన్నారు. దక్షిణాఫ్రికాతోపాటు హైదరాబాద్‌లో 25 ఏళ్లుగా పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోనూ నూతనంగా కంపెనీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ నగరాలలో మాదిరిగా జిల్లాలోనూ కంపెనీని ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్థానిక మిత్రులు చేసిన వినతిపై వెంటనే స్పందించిన భాస్కర్‌ రెడ్డి, అంజిరెడ్డి సోదరులు వెంటనే కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టారు. భవన సముదాయాన్ని ప్రారంభించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతోపాటు.. జిల్లా అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలనే లక్ష్యంతో టెక్‌బుల్స్‌ కంపెనీ ఏర్పాటు చేసినట్లు భాస్కర్‌ రెడ్డి సోదరులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి