iDreamPost

పోలవరం ఎత్తుపై ఈనాడు కుయుక్తుల వెనుక అసలు కథ అదేనా?

పోలవరం ఎత్తుపై ఈనాడు కుయుక్తుల వెనుక అసలు కథ అదేనా?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గతంలో మాదిరిగా ప్రచారం లేకుండా పనులు జరిగిపోతున్నాయి. ప్రభుత్వం, కాంట్రాక్ట్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకుని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేయత్నంలో ఉన్నాయి. కరోనా వంటి అనేక ఆటంకాలు వచ్చినా పనులకు పెద్ద సమస్య రాకుండా చూస్తున్నారు. అందులోనూ గోదావరి నదీ వరదలు లేని సమయంలో పనులు చురుగ్గా చేపట్టేందుకు అనుగుణంగా చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. పోలవరంలో కీలకమైన స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తి చేయడం దానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మొత్తం 1128 మీటర్లు పొడవు గల స్పిల్ వే నిర్మాణం రికార్డు సమయంలో పూర్తి కావడం విశేషం. గత ఏడాది సెప్టెంబర్ 9న ఈ స్పిల్ స్లాబ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 5200 క్యూబిక్ మీటర్లకు పైగా కాంక్రీట్, 700 టన్నులకు పైగా స్టీల్ వినియోగించి నిర్మాణం పూర్తి చేశారు.

అయితే పనులు వేగంగా సాగుతున్నప్పటికీ ప్రభుత్వం దానిని భూతద్దంలో చూపించి ఏదో జరుగుతుందనే అభిప్రాయం కలిగించాలానే అత్యాశకు పోవడం లేదు. అడ్డంకులన్నింటినీ అధిగమించి వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి కాలువల ద్వారా నీరు మళ్లించే సంకల్పంతో సాగుతోంది. దానికి తగ్గట్టుగానే అనేక చర్యలు చేపడుతోంది. అయితే ఇది కొందరికి జీర్ణం కావడం లేదు. పోలవరం పూర్తి కావడం, రైతులకు కాలువల ద్వారా నీళ్లు ఇవ్వడం రుచించని సెక్షన్ తయారవుతోంది. ముఖ్యంగా సుదీర్ఘకాలం తర్వాత కార్యరూపం దాల్చబోతున్న ప్రాజెక్టు గురించి ప్రతిపక్ష టీడీపీ నేతలకు మింగుడుపడే అవకాశం లేదు. నాడు వైఎస్సార్ ప్రారంభించి పనులను నేడు ఆయన తనయుడు జగన్ పూర్తి చేసే దశకు రావడం సహించలేని స్థితికి వచ్చేసినట్టు కనిపిస్తోంది.

తాజాగా పోలవరం ప్రాజెక్టు ఎత్తుకి సంబంధించి ఈనాడు కథనం అందులో భాగమేనని కొందరు భావిస్తున్నారు పోలవరం పనులు వేగంగా సాగుతున్న తీరుని ప్రజలు గ్రహించకుండా చేయడమే అసలు లక్ష్యంగా అనుమానిస్తున్నారు. కేంద్ర జలవనరుల శాఖ ఆలోచిస్తోందని, జలశక్తి మండలి అంగీకరించడం లేదన్నట్టుగా రాసిన కథనానికి ఆధారం అంటే అంతుబట్టదు. ఇప్పటికే స్పిల్ వే నిర్మాణం పూర్తయిన దశలో ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ఏమిటనే కనీస ఆలోచన కూడా లేదు. మెయిన్ డ్యామ్ ఎత్తు తగ్గిస్తే స్పిల్ వే పరిస్థితి ఏమిటనే ప్రశ్న వస్తుందన్నది కూడా గ్రహించడం లేదు. ప్రాజెక్టు పురోగతి గురించి కథనం చిన్నది చేసేందుకు ఈ ప్రయత్నం అనిపిస్తోంది. తద్వారా తాత్కాలికంగానైనా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసేందుకు ఉపయోగపడుతుందని ఆశించవచ్చు. కానీ టెక్నికల్ గానూ ఇతర కారణాల రీత్యానూ ప్రస్తుత దశలో డిజైన్లు మార్చడం, ఎత్తు తగ్గించడం అనేవి ఆచరణలో సాధ్యం కాదని తెలిసినా ఇలాంటి రాతలు మాత్రం విడ్డూరంగా కనిపిస్తోంది.

పిల్లర్ల పై 192 గడ్డర్ల ను అమర్చి స్పిల్ వే శ్లాబ్ నిర్మాణం పూర్తి చేశారు. స్పిల్ వే బ్రిడ్జి శ్లాబ్ తో పాటు పూర్తి స్థాయి ఎత్తు అంటే 55 మీటర్లకు పూర్తి చేశారు. స్పిల్ వే లో 270274 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేసినట్టు ప్రకటించారు. ఒకవైపు బ్రిడ్జి నిర్మాణం చేస్తూనే మరోవైపు గేట్లు అమర్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇప్పటికే 29గేట్ల అమర్చడంతో పాటు హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పనులు ప్రారంభమయ్యాయి. గేట్లను ఆపరేట్ చేసే పవర్ ప్యాక్ కు సంబందించిన పవర్ ప్యాక్ రూంల ఏర్పాటు పనులు మొదలు పెట్టారు. తద్వారా రాబోయే వరదల సీజన్ లో కూడా పనులకు ఆటంకం లేకుండా చేశారు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఎత్తు గురించి ఆలోచన చేయడమే అసలు నైజాన్ని చాటుతోంది. ఉద్దేశ పూర్వకంగా ప్రజలను పక్కదారి పట్టించడం ద్వారా కొన్నాళ్లపాటయినా ఏమార్చవచ్చనే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏమయినా పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం అంచనా వ్యయం పెంపుదల విషయంలో ఎన్ని మెలికలు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందడుగు వేస్తున్న తీరు అంగీకరించలేకపోవడం దుస్సాహసమే అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి